నోటు దెబ్బ సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతోందని, ప్రభుత్వానికి నష్టం వస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై ప్రధానితో సమావేశమయ్యారు. తెలంగాణ మంత్రులు కూడా పెద్ద నోట్ల గురించి తరచు మాట్లాడుతున్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రజలకు ఇన్ని బాధలుంటే గురువారం నాడు కేసీఆర్ సారూ తన నూతన గృహప్రవేశాన్ని ఆర్భాటంగా ఎందుకు చేశారు?. ఒకవైపు చిల్లర కోసం జనాలు క్యూలు కడుతున్నారు. పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి. వైద్యం అందడం లేదు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితిలో ప్రజలుంటే... ప్రజాధనంతో కట్టుకున్న ఇంట్లోకి సంబరంగా కేసీఆర్ సారు ఎంటరయ్యారు. బోల్డంత ఖర్చు పెట్టారు. ఇంటికి ప్రగతి భవన్ అని పేరు పెట్టారు. ప్రగతి తనదా, రాష్ట్రానిదా అనే విషయం మాత్రం సెలవివ్వలేదు.
గతంలో వైయస్.రాజశేఖర రెడ్డి సైతం ముఖ్యమంత్రి నివాసం అంటూ కొత్త ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడేమో కేసీఆర్ కట్టుకున్నారు. భవిష్యత్తులో వచ్చే ముఖ్యమంత్రులు కూడా తలా ఒక ఇల్లు ప్రజాధనంతో కట్టేస్తారా అనే అనుమానం ఉంది. అధికారం, నివాసం అంటూ ప్రభుత్వం తరుపున కట్టాక అందులో కొనసాగాలి అంతేకానీ వాస్తుల పేరిట కొత్త నిర్మాణాలు చేసుకుంటూ పోతే ప్రజల డబ్బు దుర్వినియోగం అవుతుంది. వ్యక్తిగత అభిరుచి పేరుతో ఇలాంటివి చేయడం వల్ల విమర్శలు తప్పవు.