సినిమా అంటేనే గ్లామర్. అందంగా కనిపించేందుకు ముస్తాబవుతుంటారు. వ్యక్తిగత పనులపై బయటకు వచ్చినా మేకప్ తప్పని సరి. అలాంటిది ఏకంగా మేకప్ లేకుండానే మా ఆర్టిస్టులు నటిస్తున్నారని నిర్మాత గర్వంగా చెబుతున్నారు. ఇది ఆశ్చర్యం కలిగించే విషయమే. గోపీచంద్, హన్సిక జంటగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మాణంలో ఉంది. ఇందులో గోపీచంద్, హన్సికతో పాటుగా ఇతర ఆర్టిస్టులు మేకప్ వేసుకోవడం లేదట. ఇది ఆసక్తి కలిగించే విషయమే. పైగా హన్సికలాంటి ముద్దుగుమ్మ నటిస్తోంది కాబట్టి పర్ ఫార్మెన్స్కంటే గ్లామర్ ఆశిస్తారు. అలాగే ఈ సినిమాకు నేపథ్యం మురికివాడలు. తాజా షెడ్యూల్ సికింద్రాబాద్ మురికివాడల్లో చిత్రీకరించారు. ఇదంతా చూస్తుంటే ఇది ఆర్ట్ ఫిల్మా? అనే అనుమానం కలుగుతోంది.
కమర్షియల్ హీరో గోపీచంద్ తో, కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా పేరున్న సంపత్ నంది కలిసి ఆర్ట్ ఫిల్మ్ తీసే సాహసం చేయకపోవచ్చు. అయితే దర్శకుడిలో ఆదర్శభావాలు ఉన్నాయంటారు. గోపీచంద్ సైతం అభ్యుదయ భావాలున్న కుటుంబం నుండే వచ్చాడు. కాబట్టి నేపథ్యం కొత్తగా ఉంటూ, సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమా చేస్తున్నారని భావించవచ్చు.