'అల్లరి' నరేష్ సినిమా పరిస్థితి గందరగోళంగా మారింది. ఆర్థిక స్లంపులో రిలీజ్ ఆగిపోయిన 'దెయ్యం' సినిమా ప్రేక్షకుల ముందుకురావడానికి ఎదురుచూస్తోంది. నవంబర్ 18న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని నిరవధికంగా వాయిదా వేశారు. ఈ లోపు 'ఎక్కడికిపోతావు చిన్నవాడా', 'జయమ్మునిశ్చయమ్మురా' చిత్రాలు వచ్చి ఆదరణ పొందాయి. వచ్చే వారం డబ్బింగ్ సినిమాలతో పాటుగా డైరెక్ట్ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. మార్కెట్ ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' సినిమాలో కదలిక మాత్రం లేదు. దెయ్యానికి భయపడని హీరో పెద్ద నోటుకు మాత్రం భయపడుతున్నట్టుంది.
డిసెంబర్ నెల మొత్తం కొత్త సినిమాల రిలీజ్ డేట్స్ తో నిండిపోయింది. కాబట్టి 'అల్లరి' నరేష్ మరింత కాలం వెయిట్ చేస్తాడేమో. వరుస అపజయాలతో కెరీర్ నిరాశాజనకంగా ఉన్న నరేష్ తాజా పరిస్థితితో ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. 'దెయ్యం' సినిమా రిలీజ్ అయ్యాక, అది సాధించే ఫలితాన్ని అనుసరించి నరేష్ కెరీర్ ఆధారపడి ఉంది.