సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్ మారుతితో చేసిన 'బాబు బంగారం' ముందు బాగా గ్యాప్ తీసుకున్నాడు. దీంతో ఆయన జోరు తగ్గిందని అందరూ భావించారు. కానీ ఆయన కూడా చిరు, బాలయ్య, నాగ్ వంటి తన తోటి సీనియర్ స్టార్స్‌లానే ప్రస్తుతం తాను కూడా జోరుపెంచాడు.
'సాలా ఖుద్దూస్'కు రీమేక్‌గా రూపొందుతున్న 'గురు' చిత్రం షూటింగ్ పార్ట్‌ను ఆయన వేగంగా పూర్తి చేశాడు. ఈ చిత్రంలో ఆయన మిడిల్ ఏజ్ బాక్సింగ్ కోచ్‌గా నటిస్తున్నాడు. ఇక ఆయనకు శిష్యురాలిగా రితికాసింగ్ నటిస్తోంది. ఈ చిత్రం ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ సుధాకొంగర ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తోంది. ఇక ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తవ్వడం, అవుట్‌పుట్ పట్ల వెంకీతో పాటు యూనిట్ మొత్తం ఎంతో హ్యాపీగా ఉంది. వై నాట్ స్టూడియోస్ బేనర్‌లో రూపొందుతున్న ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరి 26న విడుదల 'గురు'తో వెంకీ సోలోగా రానున్నాడు. తన చిత్రాన్ని చిరు, బాలయ్యల లాగే వెంకీ కూడా రిలీజ్‌కు రెండు నెలల ముందే షూటింగ్ పూర్తి చేసి సెహభాష్ అనిపించుకున్నాడు. కాగా వెంకీ తన తదుపరి చిత్రాన్ని 'నేను...శైలజ' ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ చిత్రానికి ఆల్‌రెడీ 'ఆడవాళ్లూ,.. మీకు జోహార్లు' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. టైటిల్‌పరంగా ఆసక్తిని కలిగిస్తున్న ఈ చిత్రం వెంకీకి కలిసొచ్చిన తరహాలో ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. ఈమధ్యకాలంలో ఆయన అలాంటి చిత్రం చేసి చాలా కాలమే అయింది. 'ఆడవారి మాటలకు అర్థాలు వేరులే' తర్వాత ఆయన నుండి మరలా అలాంటి తరహా చిత్రం రాలేదనే చెప్పవచ్చు. 'బాబు బంగారం' చిత్రంలో ఆ పనిచేయాలని భావించినా ఆ చిత్రం పెద్దగా విజయం సాధించలేదు. కాగా ప్రస్తుతం వెంకీ 'గురు' డబ్బింగ్‌ను చెబుతూనే మరోవైపు ఈ తాజా చిత్రం ప్రీప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్దంలోనే రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంలో దర్శకనిర్మాతలు, వెంకీ ఉన్నారు.