బెజవాడ రౌడీయిజం గురించి నాకు తెలినంతగా మరెవ్వరికీ తెలియదు అని గర్వంగా చెప్పుకునే రామ్ గోపాల్ వర్మ తీస్తున్న తాజా సినిమా వంగవీటి. దీవంగత గత రంగ జీవిత కథనే తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి రియలిస్టిక్ స్టోరీస్ తీయడం ఆయనకు అలవాటే. 'వంగవీటి' ఆడియో ఫంక్షన్ 3న జరగనున్న నేపథ్యంలో రంగ వారసుడు కోర్టు మెట్లు ఎక్కాడు. వర్మ తీసే సినిమాలకు వివాదాలు సహజమే.ఇవి ఆయనకు ఉచిత ప్రచారాన్ని తెచ్చిపెడతాయి. వర్మ కోరుకునేది కూడా అదే. రూపాయి పెట్టుబడి లేకుండా మీడియా ఫ్రీ పబ్లిసిటి రాబట్టడంలో వర్మ ఘటికుడు. ఇలా అన్నీ కలిసి రావడం ఆయనకే చెల్లింది.
ఇకపోతే బెజవాడ రౌడీయిజం గురించి తెలుసని సొంతడబ్బా వాయించుకునే వర్మ రంగ హత్య జరిగిన సందర్భంలో హైదరాబాద్ లో 'శివ' సినిమా ప్లానింగ్ లో ఉన్నారు. అంతకు మూడేళ్ళ ముందే బెజవాడ వదిలేసి కొంత కాలం తాజ్ కృష్ణ హోటల్ నిర్మాణం జరుగుతున్నపుడు సైట్ ఇంజనీర్ గా పనిచేశారు. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియో చిత్రాల నిర్మాణాన్ని పరిశీలించేవారు. ఆయన తొలి చిత్రం 'శివ' 1989లో రిలీజైంది.రంగ హత్య జరిగింది 1988లో. ఇవన్నీ చాలామందికి తెలిసిన విషయాలే అయినప్పటికీ రౌడీయిజంలో మాస్టర్ డిగ్రీ చేసినట్టు గొప్పగా చెప్పుకుంటూ 'వంగవీటి' ప్రచారం కోసం వాడుకుంటున్నారు.