ప్రతిపక్షాల విమర్శలకంటే కోదండ విమర్శలకే ఉలిక్కి పడుతోంది తెలంగాణ ప్రభుత్వం. అందుకే ఆయన చేసే విమర్శలపై ఎదురుదాడి చేయడానికి మంత్రులు పోటీ పడుతున్నారు. కోదండ మాట్లాడితే ప్రజలు ఆలోచిస్తారు. ప్రభుత్వ నిబద్దతపై అనుమానిస్తారు. ఉద్యమంలో కీలక పాత్రధారిగా ఉన్న కోదండను తెలంగాణ వచ్చాక కేసీఆర్ పక్కన పెట్టేసారు. జెెఏసిని నిర్వీర్యం చేయడానికి కింది స్థాయి నేతలను పదవుల ద్వారా ఆకట్టుకుని తప్పించేశారు. కోదండను ఒంటరి చేయడానికి ప్రయత్నించినా, ఆయన నోటికి మాత్రం తాళం వేయలేకపోయారు. కోదండ విమర్శల వెనుక ప్రతిపక్షాలు ఉన్నాయని తిప్పికొట్టినా ఆ వ్యూహం ఫలించలేదు. రోజు రోజుకు కోదండ బలపడుతున్నాడు. దీంతో తెరవెనుక రాజీ ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం.
ఇకపోతే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కోదండకు వారంతా అండగా ఉన్నారని, నిధులు సమకూరుస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అలాగే రాష్ట్ర నాయకత్వం తమ సామాజిక వర్గానికి కాకుండా ఇతరుల చేతుల్లో ఉండడం వారికి నచ్చడం లేదట. భవిష్యత్తులో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కేసీఆర్ ను ఎదుర్కోవడం కష్టమనే అభిప్రాయం ఉంది. అందువల్ల కోదండ నాయకత్వంలోనే ఒక పార్టీని నెలకొల్పితే ఎలా ఉంటుందనే చర్చ జరుగుతున్నట్టు సమాచారం. కాంగ్రెస్, తెదేపాలో యాక్టివ్ గా ఉన్న నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి కూడా తమ సామాజిక వర్గమే కాబట్టి వారిని కలుపుకుని పార్టీ పెట్టాలనే ఆలోచన ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ ను ఎదుర్కోవడానికి ఇదే సరైన మార్గమని వారు నమ్ముతున్నారు. దీనికి కోదండరామ్ కూడా సై అంటే రాష్ట్ర రాజకీయాల ముఖచిత్రం మారుతుంది.