మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ..' టీజర్ భారీ ఊహాగానాల నడుమ విడుదలైంది. వారసుడు రామ్ చరణ్ 'ధృవ' సినిమా విదేశాల్లో (8న) రిలీజైన రోజునే 'ఖైదీ..' హడావుడి మొదలైంది. సంక్రాంతి బరిలో దిగనున్న చిరంజీవి సినిమా ప్రచారానికి గురువారం తెరదీశారు. ఇక ఈ టీజర్ తన పూర్వ అభిమానులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా రూపోందించినట్టు స్పష్టమవుతోంది. రెగ్యులర్ గానే ప్రాసతో డైలాగ్ పెట్టారు. ఫైట్, డాన్స్ కూడా ఉన్నాయి. టీజర్ నిడివి కొద్ది క్షణాలు మాత్రమే కావడం వల్ల సినిమాపై పూర్తి అంచనా వేయడం కష్టం. అయితే చిరంజీవి లుక్ మాత్రం అభిమానులకు నచ్చే అవకాశం ఉంది. 61 సంవత్సరాల వయస్సులో కూడా యాక్టీవ్ గా కనిపించారు. పాత సినిమాల్లో చిరంజీవిని చూసినట్టుగానే అనిపిస్తోందని అభిమానులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే 'ఖైదీ..' సినిమా రైతుల సమస్యల గురించి తీస్తున్నట్టు గతంలో చిరంజీవి పేర్కొన్నారు. టీజర్ లో మాత్రం వారి గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. పైగా ఇది పక్కా మాస్, కమర్షియల్ సినిమా అనే సంకేతం ఇచ్చారు. ముందుముందు విడుదల చేసే టీజర్ లో ఇతర అంశాలను జోడిస్తారని ఆశించవచ్చు. తొమ్మిదేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత ఒక మాస్ హీరో పునరాగమనం చేయడం అనేది భారతీయ సినీ చరిత్రలో లేదు. కాబట్టి 'ఖైదీ..' సాధించబోయే ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.