మూస మాస్ అండ్ యాక్షన్ చిత్రాలనే చేస్తున్నాడనే తీవ్ర విమర్శ రామ్‌చరణ్‌కు ఉంది. యావరేజ్‌గా ఉన్న తన చిత్రాలు కూడా 40కోట్లు వసూలు చేస్తూ రావడంతో ఆయన తనకు అదే మంచిదారి అని మొదట్లో భావించాడు. అందుకే ఆయన అప్పుడెప్పుడో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా కేవలం తన నుండి ప్రేక్షకులు ఏమి ఆశిస్తున్నారో అలాంటి చిత్రాలే చేస్తానని, ఎవరో చేస్తున్నారని చెప్పి తన ఇమేజ్‌కు తగని ప్రయోగాలకు తాను దూరం అని కూడా చెప్పాడు.కానీ ఇటీవల వరుస పరాజయాల నేపథ్యంలో ఆయన తన మనసును మార్చుకున్నాడు. తనపై వస్తున్న విమర్శలను ఆయన కాస్త సీరియస్‌గానే తీసుకున్నాడు.తనతోటి హీరోలు మరీ ముఖ్యంగా బన్నీ వంటి హీరోలు అన్నిరకాల ప్రేక్షకులను మెప్పించే విధంగా చిత్రాలు చేస్తూ, వరుస విజయాలు సాధిస్తుంటే దానిని చరణ్ ఓ ఛాలెంజ్‌గా తీసుకున్నాడు.ముఖ్యంగా తాను అన్నివర్గాల ప్రేక్షకులకు దగ్గర కావాలనే నిర్ణయానికి వచ్చాడు. విభిన్నచిత్రాలను ఆదరించే ఓవర్‌సీస్‌లో కూడా తన పట్టు పెంచుకోవాలనుకున్నాడు.అందులో భాగంగానే ఆయన తమిళ 'తని ఒరువన్' వంటి వెరైటీచిత్రాన్ని తెలుగులో 'ధృవ' గా మొదటి ప్రయత్నం చేశాడు. ఈ చిత్రం రెగ్యులర్ కమర్షియల్ చిత్రం కాదని కూడా తెలిసినా, ఆ చిత్రం చేయడం రిస్క్ అని అందరూ చెప్పినా కూడా ఆ చిత్రం రీమేక్‌నే చేశాడు.కాగా ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వస్తోంది. ఫస్ట్‌హాఫ్ ప్రేక్షకులను బాగా విసిగిస్తోంది.ఇక ద్వితీయార్ధం బాగా ఉన్నప్పటికీ ఈ చిత్రంలోని ఇంటిలిజెంట్ థ్రిల్లింగ్ పాయింట్లు సాదారణ ప్రేక్షకులకు సరిగ్గా అర్దం కావడం లేదన్నది మాత్రం వాస్తవం. మరోపక్క చరణ్ నటన ఎంతో మెచ్యూర్డ్‌గా ఉన్నప్పటికీ సిద్దార్ద్ అభిమన్యు వంటి విలన్ పాత్రలో అద్భుతమైన నటన కనపరిచిన అరవింద్‌స్వామి నటనకే ఎక్కువ మంది మంచి మార్కులేస్తున్నారు. ఈ చిత్రం కలెక్షన్లపై నోట్ల రద్దు ఎఫెక్ట్ బాగా పడిందని ట్రేడ్‌వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా బి,సి సెంటర్లలో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. అల్లుఅరవింద్‌కు ఉన్న పలుకుబడి, ఎన్వీప్రసాదుకు సీడెడ్‌లో ఉన్న పట్టు వంటి కారణాల వల్ల ఈ చిత్రాన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేశారు. కానీ ప్రేక్షకులు మాత్రం మల్టీప్లెక్స్‌ల వంటి మంచి థియేటర్లకే వెళుతుండటంతో మామూలు థియేటర్లలో కలెక్షన్లు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో థియేటర్ల రెంట్‌కే ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. దాదాపు 55 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఎంతవరకు వసూళ్లు సాధిస్తుంది? అనే విషయంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ చిత్రానికి వచ్చిన మొదటి రెండు రోజుల ఓపెనింగ్స్‌ను చూసుకుంటే, చరణ్ దీనికి ముందు నటించిన డిజాస్టర్ చిత్రమైన 'బ్రూస్‌లీ' కంటె తక్కువగా వచ్చాయని కొందరు లెక్కలు చూపుతున్నారు. కాగా ఈ చిత్రం రోజు రోజుకు కలెక్షన్లను పెంచుకుంటోందని మరికొందరి అభిప్రాయం. మరి ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుంది? నోట్లరద్దు ఎఫెక్ట్‌ను ఎంతవరకు అధిగమిస్తుందనేది ఆసక్తిని కలిగిస్తోంది.