తెలుగులో రాఘవేంద్రరావు, కృష్ణవంశీల లాగానే హీరోయిన్లను అందంగా చూపించడంలో తమిళంలో గౌతమ్‌మీనన్‌కు మంచిపేరుంది. ఆయన పరిచయం చేసే కొత్త అమ్మాయిలకే కాదు.. ఆయన చిత్రంలో నటిస్తోన్న పాత హీరోయిన్లకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. తాజాగా ఆయన తెలుగులో నాగచైతన్య, తమిళంలో శింబులతో తీసిన 'సాహసం శ్వాసాగా సాగిపో' చిత్రం ద్వారా మంజిమామోహన్ అనే కొత్త మలయాళీ భామను పరిచయం చేశాడు. ఆమె రెండు భాషల వెర్షన్స్‌లోనూ తానే నటించింది. కాగా ఈ చిత్రం తమిళంలో మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడుకు పలు అవకాశాలు వస్తున్నాయి. చూడటానికి కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ ఆ భామను చాలా మంది దర్శకనిర్మాతలు, హీరోలు ప్రోత్సహిస్తున్నారు. ఇక తమిళంలో 'ఇరుముగన్' చిత్రం విజయం సాధించిన తర్వాత ప్రస్తుతం చియాన్ విక్రమ్ విజయ్ చంద్రశేఖర్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రం ప్రీపొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో మొదట 'ప్రేమమ్' సుందరి సాయిపల్లవిని తీసుకోవాలని భావించారు. కానీ ఆమె పెడుతున్న కండీషన్స్‌ను తట్టుకోలేక ఆమెను ఈ చిత్రం నుండి బయటకు సాగనంపారు. ప్రస్తుతం ఆ పాత్రకు మంజిమామోహన్ అయితేనే బాగుంటుందని భావించిన యూనిట్ ఆమెతో సంప్రదింపులు జరుపుతోందని, ఆమె కూడా చియాన్ విక్రమ్ సరసన అనేసరికి ఎగిరి గంతేసిందని కోలీవుడ్ సమాచారం. మొత్తానికి ఈ చిత్రం డబ్బింగ్ వెర్షన్ ద్వారా ఆమె మరోసారి తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించడం ఖాయమని తెలుస్తోంది.