తనతో పాటు టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన తోటి హీరోయిన్లు సాధించలేని స్టార్‌డమ్‌ను సాధించి, వరుసగా టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలలో అవకాశాలు దక్కించుకుంటున్న టాప్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్. కాగా ఆమె మహేష్‌బాబుతో కలిసి నటిస్తున్న మురుగదాస్ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా మురుగదాస్ చలవతో కోలీవుడ్‌లో కూడా క్రేజ్ తెచ్చుకోవాలని ఈ భామ ఆశపడుతోంది. కాగా ఈ ఢిల్లీ బ్యూటీ దక్షిణాదిలో ఎంట్రీ ఇచ్చింది తమిళంలోనే. కానీ ఆ చిత్రం ఆమెకు తీవ్ర నిరాశను మిగిల్చింది. తమిళ ప్రేక్షకులతో పాటు అక్కడి దర్శకనిర్మాతలు కూడా ఆమెను అస్సలు పట్టించుకోలేదు. దాంతో టాలీవుడ్‌పై కన్నేసిన ఈ భామ ఇక్కడ తాననుకున్నది సాధించింది. ఇటీవల ఆమెకు కోలీవుడ్‌లో మరో అవకాశం వచ్చింది. విశాల్‌తో వచ్చిన ఈ అవకాశాన్ని ఆమె ఏవో కారణాల చేత రిజెక్ట్ చేసింది. తాజాగా ఈ భామకు హీరో కార్తి సరసన మరో చిత్రంలో చాన్స్ వచ్చింది. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా ఖరారైందంటున్నారు. మరి ఈ చిత్రమైనా ఆమె ఒప్పుకుంటుందా? లేక విశాల్‌కు హ్యాండిచ్చిన్నట్లుగా కార్తికి కూడా ఆమె హ్యాండ్ ఇవ్వనుందా? అనేది ఆసక్తికరంగా మారింది. జనవరి నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. దీంతో యూనిట్ మొత్తం ఆమె నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.