స్టార్ హీరోలకు చిత్రకథలు, హీరోయిన్ల ఎంపిక వంటివన్నీ ఒక ఎత్తైతే వారి ఇమేజ్‌కు అనుగుణంగా పవర్‌ఫుల్ టైటిల్స్‌ను వెతకడం మరో ఎత్తు. ప్రస్తుతం మహేష్ చిత్రం టైటిల్ కోసం మురుగదాస్ కిందా మీదా పడుతున్నాడు. ఆయన మహేష్‌బాబు హీరోగా తమిళ, తెలుగు భాషల్లో రూపొందిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం టైటిల్‌ను దీపావళికే ప్రకటిస్తానని మొదట్లో ప్రకటించాడు. కానీ దీపావళి వచ్చి చాలా కాలమైనా ఈ చిత్రం టైటిల్ విషయంలో మాత్రం మురుగదాస్ ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాడు. ఈ చిత్రం టైటిల్‌ను జనవరి1న, ఫస్ట్‌లుక్‌ను జనవరి 26న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రం విషయంలో రోజుకో టైటిల్ ప్రచారంలోకి వస్తుండటంతో మహేష్ ఫ్యాన్స్ తలలుపట్టుకుంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి 'ఏజెంట్ శివ, సంభవామి, అభిమన్యు' టైటిల్స్ ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ టైటిల్స్ విషయంలో యూనిట్ ఏమాత్రం క్లారిటీ గానీ, క్లూగానీ ఇవ్వకుండా మౌనం పాటిస్తున్నారు. 10ఏళ్ల తర్వాత మురుగదాస్ టాలీవుడ్‌లో చేస్తున్న ఈ చిత్రంతో మహేష్ కోలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తుండటంతో ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. గతంలో తన తమిళ చిత్రాలైన 'గజిని, తుపాకి' వంటి చిత్రాలను తెలుగులో కూడా అదే టైటిల్స్‌తో మురుగదాస్ విడుదల చేశాడు. దీంతో మహేష్ చిత్రానికి కూడా ఆయన తమిళ, తెలుగు భాషల్లో ఒకే టైటిల్‌ను పెట్టాలని ఆలోచిస్తున్నాడట. మరి ఈ చిత్రం టైటిల్‌పై సస్పెన్స్‌కు నూతన ఏడాదిలో కానీ తెరపడదు.