ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్2 చేతుల మీదుగా ఎంతో వైభవంగా ప్రారంభమైన చిత్రం 'మరుదనాయగం'. లోకనాయకుడు కమల్‌హాసన్ స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంతో పాటు టైటిల్ రోల్‌ను కూడా తానే పోషిస్తూ ఈ చిత్రం మొదలుపెట్టాడు. కాగా ఇది కమల్‌కి జీవితాశయం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో వచ్చే యుద్ద సన్నివేశాలను వందలాది మందితో ఆల్‌రెడీ చిత్రీకరించాడు. దాదాపు 30 నిమిషాల నిడివి కలిగిన షూటింగ్‌ను పూర్తి చేశాడు. ఇది దాదాపు 18ఏళ్లకు ముందు జరిగింది. కానీ ఈ చిత్రం ఆర్ధికపరమైన సమస్యల వల్ల ఆగిపోయింది. ఈ చిత్రాన్ని ఎలాగైనా పూర్తి చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయడు కమల్. కాగా ఈ చిత్రం భారతదేశపు తొలి స్వాతంత్య్ర పోరాట యోధుడు మహ్మద్ యూసఫ్ ఖాన్ చరిత్ర. ఆయన అసలు పేరు మరుదనాయగం పిళ్లే. తమిళనాడు నుంచి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టిన మొట్ట మొదటి తమిళుడిగా ఆయన చిరస్ధాయిగా నిలిచిపోయాడు. ఆయన జీవిత చరిత్రతో తెరకెక్కించబోయిన కమల్ ఈ చిత్రం ట్రైలర్ కోసం దాదాపు రెండు దశాబ్దాల కిందటే 9కోట్లు ఖర్చుచేయడం సంచలనం సృష్టించింది. కాగా ఈ చిత్రాన్ని మరలా తెరకెక్కించి పూర్తి చేయడానికి కమల్ లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్‌ను ఇటీవల కలిసి చాలా సేపు ముచ్చటించాడట. త్వరలో ఈ చిత్రాన్ని తమ లైకా ప్రొడక్షన్స్ బేనర్‌లో పూర్తి చేయడానికి సుభాస్కరన్ కమల్‌కు మాట ఇచ్చాడని చెబుతున్నారు. మొత్తానికి కమల్ డ్రీమ్ నెరవేరుతుందనే ఆశిద్దాం.