నిన్న మంగళవారం రాత్రి హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో రామ్ గోపాల్ వర్మ జర్నీ 'శివ టు వంగవీటి' కార్యక్రమం అతిరథ మహారథుల మధ్యన అంగరంగ వైభవంగా జరిగింది. అసలు ఈ వేడుక జరగడానికి ఒక ప్రత్యేక కారణం వుంది అదేమిటంటే రామ్ గోపాల్ వర్మ ఇక వంగవీటి చిత్రం తన చివరి చిత్రమని.... వంగవీటి తర్వాత తాను ఏ చిత్రాలని డైరెక్ట్ చెయ్యనని చెప్పడమే. ఇప్పటివరకు వర్మ టాలీవుడ్ మొదలుకుని బాలీవుడ్ వరకు చాలా చిత్రాలనే తెరకెక్కించాడు. ఇక వంగవీటి చిత్రమే తన చివరి చిత్రమని చెప్పి షాక్ ఇచ్చిన వర్మ తన చివరి చిత్రానికి సంబందించిన పాటల వేడుకని ఇలా అతిధుల మధ్యన జరుపుకున్నాడు. ఈ వేడుకకి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ వస్తాడని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ఈవెంట్ కి రాలేకపోయారు.
ఇక టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి దగ్గరనుండి నాగార్జున, వెంకటేష్, రాజ్ తరుణ్, బోయపాటి, వంశీ పైడిపల్లి, వై.వి.ఎస్ చౌదరి, పూరి, సుబ్బిరామిరెడ్డి, జీవిత, రాజశేఖర్ మొ.. ప్రముఖులు ఈ 'శివ టు వంగవీటి' వేడుకలో పాల్గొని రామ్ గోపాల్ వర్మని ఆకాశానికెత్తేశారు. ఇక నాగార్జున అయితే రామ్ గోపాల్ వర్మ రెండు, మూడు పెగ్గులు వోడ్కా తాగేవాడని.... నేను మాత్రం ఒక్క పెగ్గు వోడ్క తాగేవాడినని.....ఇక వోడ్క తాగిన రాము తనకి కథ చెప్పేవాడని..తన దగ్గర వున్న పెన్సిల్, పెన్నునే కత్తి అనుకుని దాన్ని పట్టుకుని మీదకి వచ్చే వాడని... దానితో తనకి భయం వేసేది చెప్పుకొచ్చాడు. అందుకే రాముకి దూరంగా కూర్చుని నేను కథలు వినేవాడినని చెప్పాడు. ఇక నాగ్ మాట్లాడుతూ రాము చివరి చిత్రం వంగవీటి కాకూడదని శివ 2 తనతో చెయ్యాలని చెప్పాడు.
అసలు 'నా ఇష్టం' అనే బుక్ రాసుకుని నీకు నీవే అంకితమిచ్చుకున్నటువంటి వాడివి.... నువ్వెందుకింత ఎమోషనల్ అయ్యి ఒట్లు వేస్తున్నావు... అలంటి ఒట్లు వెయ్యకు రామూ... అంటూ నాగార్జున వర్మని సెటైరికల్ గా అడిగాడు. అంతేకాకుండా నాగార్జున కి ఎప్పుడైనా బోర్ కొడితే రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ అకౌంట్ ని ఓపెన్ చేసి అన్ని చదువుతానని.... అవి చదివాక రాము ఎన్ని పెగ్గులు వేసి ఎలా ట్వీట్ చేసాడో అని సరదాగా నవ్వుకుంటానని చెప్పాడు. ఇక శివ 2 నువ్వు డైరెక్ట్ చేస్తే నేను హీరోగా నటిస్తానని లేకపోతె లేదని ఖచ్చితం గా నాగార్జున రామ్ గోపాల్ వర్మకి చెప్పేసాడు.