మద్రాస్ లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ వున్ననాటి నుంచే చిత్ర నిర్మాణంలో ప్రత్యేక శైలి ఏర్పరచుకున్న అగ్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్. అప్పట్లో పూర్ణోదయా పిక్చర్స్, క్రియేటివ్ కమర్సియల్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలకు పోటీగా వరుసగా చిత్రాలు నిర్మించిన సురేష్ ప్రొడక్షన్స్ నేటి తరం లో ఆ జోరు చూపలేకపోతుంది. రామానాయుడు మరణం తరువాత నిర్మాణ భాగస్వామిగా, లేక సమర్పకులుగా మాత్రమే వ్యవహరిస్తూ వస్తున్నారు సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు. అయితే ఈ నిర్ణయం తాను ఇష్టపడే తీసుకున్నట్టు చెప్తున్నారు సురేష్ బాబు. పిట్ట గోడ చిత్రాన్ని ఆయన సమర్పణలో గ్రాండ్ రిలీజ్ చేస్తున్న సురేష్ బాబు మీడియాతో ముచ్చటించారు.
పాత రోజులలో మేము వరుసగా సినిమాలు చేసినప్పుడు ప్రత్యేకించి నిర్మాణ సంస్థలకు ప్రేక్షకులలో ఒక బ్రాండ్ ఉండేది. సురేష్ ప్రొడక్షన్స్ సినిమా అంటే అంచనాలు పెరుగుతుండేవి. కానీ నేటి తరంలో అది చూడలేము. అంచనాలు కేవలం హీరో-డైరెక్టర్ కాంబినేషన్ మీదే ఆధారపడి ఉంటున్నాయి. ఈ తరుణంలో కేవలం మా ఉనికిని కాపాడుకోవటానికి నా వద్దకు వచ్చిన ప్రతి కథని నిర్మించలేను. మారిన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమాలు తీయటానికి ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్నాం. మా నుంచి సినిమా ఆలస్యంగా వచ్చినా పర్లేదు కానీ మా సంస్థకు దశాబ్దాలుగా వున్న గుడ్ విల్ మాత్రం పోగొట్టుకోము. సినిమాల సంఖ్య తగ్గింది తప్పితే మేము విరామం తీసుకోలేదు. మా సంస్థ లో అవకాశం కోసం వచ్చేవారి సంఖ్య కూడా తగ్గలేదు. ప్రేక్షకుల అభిరుచికి తగ్గ కథలు కోసం వేచి చూసి అటువంటి కథలతో వచ్చిన రవి బాబు, తేజలతో ప్రస్తుతం రెండు సినిమాలు నిర్మిస్తున్నాను. నాగ చైతన్య హీరోగా మరో చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ లో రానా నిర్మిస్తాడు. అలనాటి మేటి చిత్రం ప్రేమనగర్ నేటి తరానికి తగ్గ మార్పులతో రీమేక్ గా అందించే ప్రయత్నాలు కూడా చేస్తున్నాను.. అంటూ సురేష్ ప్రొడక్షన్స్ పాటిస్తున్న నిబంధనలతో పాటు భవిష్యత్ లో రానున్న చిత్రాలపై కూడా స్పష్టత ఇచ్చారు సురేష్ బాబు.