ఇప్పటికే పైరసీ పేరుతో సినీ పరిశ్రమ వణికిపోతుంటే...ఈ మధ్య లీకేజ్ సమస్య మరింత గా సినీ మేకర్స్ ని భయపడేట్లు చేస్తుంది. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు కొత్తగా నోట్ల రద్దు. వీటన్నిటి నడుమ నిర్మాత అనేవాడు బలి కావాల్సి వస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు కొత్తగా టాలీవుడ్ లో ఒక స్కామ్ వినిపిస్తుంది. టాలీవుడ్ కి చెందిన ఒక నిర్మాత చేస్తున్న స్కామ్ ఇది. మరి దీనిని స్కామ్ అంటారో, మోసం అంటారో లేక బెదిరింపు అంటారో తెలియదు కానీ..సదరు నిర్మాత చేస్తున్న పనితో సినీ నిర్మాతలు కొందరు తీవ్ర వేదన అనుభవిస్తున్నారు.
విషయం లోకి వస్తే..డిస్ట్రిబ్యూటర్ గా పేరున్న ఈ నిర్మాత.. 'ఠాగూర్' సినిమాలో చిరంజీవి తన ACF బృందాన్ని ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లో చేర్చినట్లుగా..ఇండస్ట్రీ లోని అన్ని స్టూడియోల్లోనూ, లాబుల్లోనూ, అన్ని సినిమాల సెట్లలోనూ తనకంటూ ఓ మనిషిని పెట్టి..సదరు సినిమాల్లో వున్న మ్యాటర్ ఏంటి అనేది రాబడుతున్నాడంట. డిస్ట్రిబ్యూషన్ రంగం తో కూడా టచ్ వున్న ఈ నిర్మాత..తను ఏర్పాటు చేసుకున్న వ్యక్తుల నుండి సినిమా రిపోర్ట్ రాబట్టుకుని, రిపోర్ట్ బావుంటే పోటీ పడి మరి సినిమాని తీసుకోవడం, లేదంటే ఆ సినిమా జోలికి తను వెళ్ళటమే కాకుండా, ఇతర డిస్ట్రిబ్యూటర్స్ కి కూడా విషయాన్ని చెప్పి..సినిమా అమ్ముడు పోకుండా అడ్డుపడుతున్నాడట. ఇక సినిమా కొనేవాడు రాకపోతే నిర్మాత ఏం చేస్తాడు..? ఎంతో కొంత అన్నట్లుగా ఆ డిస్ట్రిబ్యూటర్స్ కే వదిలేస్తాడు. ఇదంతా చూసి, పెట్టిన ఖర్చులు రాక, ఎందుకు సినిమా తీశామా అని నెత్తి నోరు బాదుకుని..దారుణమైన నష్టాన్ని చవిచూస్తున్నారు నిర్మాతలు.
అసిస్టెంట్ డైరెక్టర్స్ ని, అసిస్టెంట్ ఎడిటర్స్ ని గుప్పిట్లో పెట్టుకుని సినిమా సమాచారాన్ని ముందుగానే తెలుసుకుంటున్న సదరు డిస్ట్రిబ్యూటర్ కమ్ ప్రొడ్యూసర్ చేస్తున్న ఈ పని పైరసీ కంటే పెద్ద ఘోరమైనది. దీని గురించి ఇండస్ట్రీ లోని పెద్దలకు తెలిసినా కూడా..ఆ నిర్మాతకు వున్న పలుకుపడితో ఏం చేయలేని పరిస్థితి. మరి ఈ స్కామ్ నుండి చిత్ర పరిశ్రమ ని, నిర్మాతలని కాపాడేదెవరో..?