'ఓం నమో వేంకటేశాయ' టీజర్‌కి అద్భుత స్పందన
అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై ఎ.మహేష్‌రెడ్డి నిర్మిస్తున్న మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్‌కి, మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. కాగా, 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం టీజర్‌ను ఈరోజు(డిసెంబర్ 24) ఉదయం విడుదల చేశారు. అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో ఈ భక్తిరస చిత్రంపై ప్రేక్షకులకు వున్న అంచనాలకు మించి టీజర్ వుందని అందరూ ప్రశంసిస్తున్నారు. 'అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా.. ఆనంద నిలయ వర పరిపాలకా..' అంటూ సాగే పాట అందర్నీ భక్తి పారవశ్యంలో ముంచెత్తుతోంది. 'ఈ కొండపై ఎవరి మీద ఈగ వాలినట్టు తెలిసినా.. ఉగ్ర శ్రీనివాసమూర్తి సాక్షిగా, జ్వాలా నరసింహుడి సాక్షిగా, పదివేల పడగల బుస బుసల సాక్షిగా ఏం చేస్తానో చెప్పను' అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్‌కి మంచి స్పందన వస్తోంది. అలాగే అనుష్క, జగపతిబాబు, ప్రగ్యా జైస్వాల్‌ల గెటప్స్ సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచేలా వున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.
అక్కినేని నాగార్జున హాథీరామ్ బాబాగా మరో అద్భుతమైన పాత్ర చేస్తున్న ఈ చిత్రంలో వేంకటేశ్వరస్వామిగా సౌరబ్‌జైన్ నటిస్తుండగా, భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క కనిపించనుంది. జగపతిబాబు, ప్రగ్యా జైస్వాల్, విమలా రామన్, రావు రమేష్, వెన్నెల కిషోర్, ప్రభాకర్, రఘుబాబు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రూపొందిస్తున్న ఈ చిత్రానికి స్వరవాణి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్.గోపాల్‌రెడ్డి, జె.కె.భారవి, కిరణ్‌కుమార్ మన్నె, గౌతంరాజు ఇతర సాంకేతిక వర్గం.