మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో పాలిటిక్స్‌కి అంతుపట్టలేకుండా పోతుంది. మరీ ఒక వర్గమే అన్నట్లుగా 'మా' యూనిట్ ప్రవర్తించడం సినీ అభిమానుల్ని సైతం ఆలోచించేలా చేస్తుంది. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిపై 'మా' యూనిట్ చూపుతున్న అభిమానం మంచిదే కానీ..'మా' అంటే ఓన్లీ చిరంజీవే అన్నట్లు ప్రవర్తించడమే..వారి గురించి ఆలోచించాల్సిన పరిస్థితిని కల్పిస్తుంది. దీనికి అనేకానేక కారణాలు ఉన్నప్పటికీ, రీసెంట్‌గా జరిగిన 'మా-2017' డైరీ ఆవిష్కరణ కార్యక్రమమే పెద్ద ఉదాహరణగా కనిపిస్తుంది.
మెగాస్టార్ చిరంజీవితో 2017కి సంబంధించిన మా డైరీని ఆవిష్కరించిన 'మా' కార్యవర్గం..'మా' ఫౌండర్ ప్రెసిడెంట్ అని సంబోధిస్తూ..పెద్ద తతంగమే చేసింది. బాగా లోతుగా ఆలోచించి చిరంజీవి చేస్తున్న 150వ చిత్రానికి వెల్‌కమ్ చెబుతున్నామన్నట్లుగా 150 గులాబీలతో పుష్ఫగుచ్చం తయారు చేయించి మరీ చిరుకి అందించింది 'మా' అసోసియేషన్. ఇదంతా బాగానే ఉంది. పౌండర్ ప్రెసిడెంట్ చేస్తున్న మైలురాయి చిత్రం కాబట్టి ఇలా చేశారని అనుకోవచ్చు. అయితే మరో మైలురాయి చిత్రాన్ని..పక్కా తెలుగువాడి చిత్రంతో అధిగమించబోతున్న 'గౌతమిపుత్ర శాతకర్ణి' బాలయ్యని ఎందుకు వదిలేశారు? 'మా' అంటే ఓన్లీ చిరంజీవేనా..? 'మా' కి బాలయ్యేం కాడా..? కెరీర్‌లో 100వ చిత్ర మైలురాయిని అందుకుంటున్న బాలయ్యకి కూడా డైరీతో పాటు పుష్ఫగుచ్ఛం ఇవ్వచ్చుగా..? ఇండస్ట్రీలో అంతా సమానమే అనే భావం కలిగించవచ్చుగా..? అని బాలయ్య అభిమానులు 'మా' పై డైరెక్ట్‌గానే ప్రశ్నలు సంధిస్తున్నారు.