రెండు రోజుల క్రితం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఆడియో వేడుక తిరుపతిలో అతిరథ మహారథుల మధ్య అంగరంగ వైభవంగా జరిగిన సంగతి విదితమే. ఈ వేడుకలో డైరెక్టర్ క్రిష్ బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమిపు త్రశాతకర్ణి’ గురించి, హీరో బాలకృష్ణ గురించి, తన తల్లి అంజనా దేవి గురించి, భార్య రమ్య గురించి మాట్లాడాడు. ఇక ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం సంక్రాతి బరిలో ఉంటుందని మిగతా చిత్రాలు కొంచెం జాగ్రత్తగా ఉండమనే అర్ధంలో ‘ఖబడ్దార్’ అంటూ హెచ్చరిక లాంటి పదంతో ముగించాడు తన ప్రసంగాన్ని.
అయితే ‘ఖబడ్దార్’ అని ‘గౌతమిపుత్ర శాతకర్ణి’తో పాటు సంక్రాతి బరిలో వున్న మెగా స్టార్ చిరు 150 వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' ని ఉద్దేశించే క్రిష్ అలాంటి హెచ్చరిక చేసాడనే వార్తలు నిన్న సోషల్ మీడియా అంతటా హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే మెగా ఫ్యాన్స్ కూడా క్రిష్ వ్యాఖ్యలపై మండిపడుతున్న తరుణంలో డైరెక్టర్ క్రిష్ ఆ వ్యాఖ్యలపై స్పందించాడు.
నేను మెగా స్టార్ చిరు 'ఖైదీ నెంబర్ 150' చిత్రాన్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చెయ్యలేదని... నేను ‘ఖబడ్దార్’ అన్నదానికి కొత్త అర్థాలను వెతికి గొడవ చెయ్యకండని... నేను కేవలం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి తరపున ఆ మాట అన్నాను. మన సంస్కృతికి, సంప్రదాయాలకు సరైన గౌరవం మర్యాదలు దక్కడం లేదనే తెలుగు ప్రజల బాధను మాత్రమే నేను వ్యక్తం చేశాను. నేను ‘ఖబడ్దార్’ అని హెచ్చరించింది తెలుగు వారిని గౌరవించని, దేశాన్ని, ప్రపంచాన్ని. అంతే తప్ప వ్యక్తులను కాదు... అంటూ వివరణ ఇచ్చాడు. అలాగే క్రిష్ నేను మెగా హీరోలను ఉద్దేశించి 'ఖబడ్డార్' అనలేదని ఇలా నావ్యాఖ్యలు వక్రీకరించి రాయొద్దని వేడుకున్నాడు.
నాకు ఎప్పటినుండో మెగా హీరోలతో అవినాభావ సంబంధం వుంది. అందుకే నేను అల్లు అర్జున్ తో నా రెండో సినిమానే 'వేదం' చేసాను. ఇక వరుణ్ రెండో సినిమా 'కంచె' కూడా చేసాను. అలాంటి నేను మెగా హీరోలను ఉద్దేశించి ఎందుకలా అంటాను అని చెప్పుకొచ్చాడు. ఇలాంటి గొడవలు సృష్టించి నన్ను మెగా ఫ్యామిలీకి దూరం చెయ్యొద్దని వేడుకున్నాడు.