రాజకీయాల సంగతి పక్కనపెడితే.. ఓ స్టార్‌గా పవన్ పెద్దగా వివాదాస్పద వ్యక్తి కాదు. ఆయన తన చిత్రాలు ఫ్లాప్ అయితే తానే ముందుకు వచ్చి నిర్మాతలను, బయ్యర్లను ఆదుకునే ప్రయత్నం చేస్తాడు. ఇప్పటివరకు తన చిత్రాల విషయంలో గానీ, రెమ్యూనరేషన్స్ వంటి విషయాల్లో గానీ ఆయన ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేదు. కాగా పవన్-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాతగా వచ్చిన 'అత్తారింటికి... దారేది' చిత్రం ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఈ చిత్రంలోని కొంతభాగం సినిమా రిలీజ్‌కు ముందే లీక్ కావడంతో పవన్ ఆ చిత్రాన్ని తొందరగా విడుదల చేయాలని భావించి... ముందు సినిమా రిలీజ్ చేయండి.. తర్వాత రెమ్యూనరేషన్ సంగతి చూసుకుందామని చెప్పి, అందుకు డైరెక్టర్ త్రివిక్రమ్‌ను కూడా ఒప్పించి, నిర్మాతకు ధైర్యం చెప్పాడు.
ఈ చిత్రం రిలయన్స్ సంస్థ బాగస్వామ్యంతో నిర్మితమైనప్పటికీ, అందునా నిర్మాత ప్రసాద్‌కు భారీ లాభాలు తెచ్చిపెట్టినా ఆయన మాత్రం పవన్‌కు రెమ్యూనరేషన్ ఇవ్వడంలో జాప్యం చేశాడు. దీంతో ఇదే నిర్మాత ఎన్టీఆర్‌తో 'నాన్నకు ప్రేమతో' చిత్రం తీసి, విడుదల చేస్తున్న నేపథ్యంలో పవన్ తనకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ రెమ్యూనరేషన్ కోసం ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. తాజాగా బివిఎస్‌ఎన్‌ప్రసాద్ మాట్లాడుతూ, పవన్‌కు రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిన మాట వాస్తవమేనని, కానీ పవన్ ఇలా కంప్లైట్ చేస్తాడని భావించలేదన్నాడు.
సినిమా ఫీల్డ్‌లో ఇవ్వన్నీ సహజమే అని చెబుతూనే, పవన్ నేనివ్వాల్సిన డబ్బులకోసం పిర్యాదు చేసే సమయంలో ఆయన ఆర్థికపరిస్థితి అంత దారుణంగా ఉందని తెలిసి బాధపడ్డానన్నాడు. పవన్ ఫిర్యాదు వల్ల 'నాన్నకు ప్రేమతో' చిత్రం రిలీజ్ విషయంలో చాలా చాలా ఇబ్బందుపడ్డానంటూ సన్నాయినొక్కులు నొక్కాడు. కాగా ఆయన ఆఫ్‌ది రికార్డు మాట్లాడుతూ, స్టార్స్ చిత్రాల విషయంలో ఇలాంటి ఇబ్బందులు వస్తే.. కూర్చొని పరిష్కరించుకుంటారని, కానీ పవన్ అలా చేయలేదంటూ తన తప్పును కప్పిపుచ్చుకుంటూ పవన్‌పైనే నిందలు వేయడం విన్నవారికి మతులు పోయాయని సమాచారం.