నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఎవరు? అంటే ఎవరైనా సరే ఠక్కున అనుష్క పేరు చెప్పేవారు. కానీ ప్రస్తుత పరిస్థితి దానికి విరుద్దంగా కనిపిస్తోంది. వయసు మీద పడటం, బరువు బాగా పెరిగి, స్లిమ్ లుక్‌ను కోల్పోవడంతో ఆమె యంగ్‌స్టార్స్ పక్కన సూట్ కాని పరిస్థితి నెలకొంది. 'మిర్చి' తర్వాత మరలా ఆమె రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలలో కనిపించలేదు. ఇక ఈ అమ్మడు 'సైజ్ జీరో' తర్వాత మరలా ఈ ఏడాదిలో కనిపించలేదు. 'ఊపిరి, సోగ్గాడే చిన్నినాయనా' వంటి చిత్రాలలో అతిథి పాత్రల్లో మాత్రమే దర్శనమిచ్చింది. కాగా 2017లో మాత్రం ఈ అమ్మడు ఏడాది ప్రధమార్ధంలోనే నాలుగు చిత్రాలలో కనిపించనుంది. ఆమె సూర్య సరసన నటించిన 'ఎస్‌త్రీ' చిత్రం జనవరి26న విడుదలకు సిద్దమవుతోంది. ఇక అమ్మవారిగా, భక్తురాలు కృష్ణమ్మగా ఆమె నటించిన నాగ్ చిత్రం 'ఓం నమో వేంకటాశాయ' చిత్రం ఫిబ్రవరి 10న రానుంది. ఆమె దేవసేనగా పూర్తి స్థాయిలో కనిపించే 'బాహుబలి-ది కన్‌క్లూజన్' చిత్రం ఏప్రిల్ 28న రిలీజ్ అవుతుంది. ఈ చిత్రాలన్నీ ప్రస్తుతం పూర్తయ్యాయి.
ఇక 'పిల్లజమీందార్' ఫేమ్ అశోక్ దర్శకత్వంలో ఆమె నటిస్తున్న మరో లేడీఓరియంటెడ్ మూవీ 'భాగమతి' షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ చిత్రం కూడా సమ్మర్ కానుకగానే విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. 'బాహుబలి2'తో పాటు సూర్యతో చేస్తున్న 'ఎస్3' చిత్రాలలో ఆమె కాస్త గ్లామర్ పాత్రలనే పోషిస్తోంది. ఆమె మరలా రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు సూట్ అవుతుందా? లేక ఇక ఆమె కేవలం డిఫరెంట్ మూవీస్‌కే పరిమితమవుతుందా? అనే విషయం ఈ రెండు చిత్రాలు విడుదలయిన తర్వాత ఆమె సగటు మాస్ ప్రేక్షకులను తన గ్లామర్‌తో ఏమాత్రం మెప్పిస్తుంది? అనే దానిపైనే ఆధారపడివుంది.