భారత ప్రధాని నరేంద్ర మోడి నూతన సంవత్సరం ఆరంభానికి ముందు చేసిన ప్రసంగం భారతీయులందరినీ ఆలోచింపచేసింది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ దేశం మొత్తం మీద చూసుకుంటే కేవలం 24 లక్షల మందే తమ వార్షిక ఆదాయం 10 లక్షల రూపాయలకు పైబడి ఉందని వెల్లడైందని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇదంతా వాస్తవమని మనం విశ్వసిద్ధామా? అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. భారత దేశంలో నీతి పెరగాలని, తప్పులు లెక్కలు చూపడం ఇకనైనా మానుకోవాలని ఆయన వెల్లడించాడు. ఇంకా మోడీ మాట్లాడుతూ... పెద్ద నోట్లు రద్దు చేయడం కారణంగా మంచి ఫలితాలే వచ్చాయని, వాస్తవంగా చూసుకొంటే విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన కొట్టి పారేశాడు.
కాగా రాహుల్ గాంధీ ఈ మధ్య మాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దు కారణంగా వ్యవసాయం తగ్గింది అన్నారు. అలాంటిదేమీ లేదని, గత సంవత్సరం రబీ సాగు 6 శాతం పెరిగితే, వాటి ఎరువుల కొనుగోళ్ళు 9 శాతం వరకు పెరిగాయని మోడీ ధీటుగా స్పందించాడు. అయితే మోడీ ఓ విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పాడు. భారత్ లో అపారమైన సహజ వనరులతో పాటు మానవ వనరులు కూడా ఉన్నాయి. ఓ పక్క 65 శాతం వరకు యువత ఉంది. అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. అందుకు తగిన సాధనాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి.. ఇంకా దేశం వెనకబడి ఉండటానికి కారణం ఉందా? అంటూ ప్రధాని ప్రశ్నించాడు. అలా ఉండకూడదు అంటూ... ఇంత సంపద, సహజవనరులు ఉన్న దేశం అభివృద్ధి చెందకుండా ఉండటానికి కారణం అవినీతి, నల్లధనం అని వాటిపై యుద్ధానికి మద్దతు తెలిపిన ప్రజలందరికీ ధన్యవాదాలు అంటూ మోడి తెలియజేశాడు.
అంతే కాకుండా పేదప్రజలకు, మధ్య తరగతి ప్రజలకు సొంత ఇంటి కల సాకారం చేసుకొనేందుకు కొన్ని రాయితీలను కూడా ప్రకటించాడు. ఇంతా వ్యవసాయదారులకు మేలు చేకూరేలా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాడు. గర్భిణీస్త్రీలకు, సీనియర్ సిటిజెన్లకు ప్రోత్సాహకాలు ప్రకటించాడు. తాను ఏమాత్రం కూడా అనివీతిపై అదేవిధంగా నల్లధనం మీద యుద్ధం ఆపనని చాలా స్పష్టంగా తెలిపాడు. కాగా సామాన్యుడు అనుభవిస్తున్న నోట్ల ఇబ్బందులు త్వరలోనే తొలగి పోతాయని ఆయన హామీ కూడా ఇచ్చాడు. కాగా కొత్త ఏడాది శుభ సందర్భంగా మోడి సాహసంతో తీసుకున్న నిర్ణయంతో మంచి ఫలితాలు వస్తాయని, అంతవరకు తాను అవినీతిపై పోరాడుతూనే ఉంటానని మోడి వివరించాడు.