నాగచైతన్య... అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్, సురేష్ ప్రొడక్షన్స్ బేనర్‌ల అధినేతలైన స్వర్గీయ ఏయన్నార్, డి.రామానాయుడులకు కూడా మనవడు కావడంతో ఆయనకు నిర్మాతల సమస్య లేదు. చైతూ తాజాగా నటించిన 'ప్రేమమ్' చిత్రం అందరి ప్రశంసలు అందుకోగా, 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం ఫర్వాలేదనిపించుకుంది. ఆయన ప్రస్తుతం అన్నపూర్ణ బేనర్‌లో తన తండ్రి నాగార్జునకు తన మొదటి చిత్రంతోనే 'సోగ్గాడే చిన్నినాయనా' వంటి బ్లాక్‌బస్టర్ అందించిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓచిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం నితిన్, రామ్‌చరణ్, నారారోహిత్ వంటి వారు నిర్మాతలుగా మారిన సమయంలో తాజాగా నిర్మాతగా కూడా సినిమాలకు శ్రీకారం చుట్టిన దగ్గుబాటి రానా నిర్మాతగా, నాగచైతన్య హీరోగా ఓ చిత్రం జనవరి 29న ప్రారంభంకానుంది. నూతన దర్శకుడు ఆర్వి మరిముత్తు ఈ చిత్రంతో దర్శకునిగా మారుతున్నాడు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందనుంది.
కాగా పలువురు స్టార్ హీరోలు, యంగ్ హీరోలు పరభాషల్లో కూడా మార్కెట్ పెంచుకోవాలని ప్రణాళికలు సిద్దం చేస్తున్న తరుణంలో ఈ చిత్రం ద్వారా నాగచైతన్య కూడా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తెలుగులో ఇంకా సరైన స్థాయికి ఎదగని చైతూ, ఇలా ఇప్పుడే కోలీవుడ్‌పై కన్నేయడంపై విమర్శలు వస్తున్నాయి. అయినా త్వరలో చైతూతో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం తీసి, తమిళంలోకి కూడా పరిచయం చేస్తానని హామీ ఇచ్చిన గౌతమ్‌మీనన్ వంటి క్రియేటివ్ దర్శకునికంటే ముందే ఓ కొత్త దర్శకునితో చైతూ కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం ఆశ్చర్యకరమే. ఈ చిత్రంలోని ఓ కీలకపాత్రలో దగ్గుబాటి రానా కూడా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.