తెలుగులో వెంకటేష్‌తో 'బాబు బంగారం', తమిళంలో విక్రమ్‌తో 'ఇరుముగన్' చిత్రాల తర్వాత నయనతార తన రూట్‌ను పూర్తిగా మార్చివేసింది. అగ్రహీరోలతో, యంగ్ హీరోలతో కూడా అవకాశాలు వస్తున్నప్పటికీ లేడీ ఓరియంటెడ్ చిత్రాలనే ఎంచుకుంటూ, లేడీ సూపర్‌స్టార్‌లా ఎదగాలనే నిర్ణయానికి ఆమె వచ్చినట్లు కోలీవుడ్ సమాచారం. ప్రస్తుతం ఆమె చేస్తున్న నాలుగు చిత్రాలు కూడా అదే కోవకు చెందినవే కావడం గమనార్హం. గతంలో 'అనామిక', తాజాగా 'మాయ' చిత్రాలలో నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం డాస్ రామస్వామి దర్శకత్వంలో 'డోరా' అనే చిత్రంలో నటిస్తోంది.
మింజూర్ గోపి అనే నూతన దర్శకునితో పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న 'ఆరిమి' చిత్రంలో ఐఏయస్ ఆఫీసర్‌గా నటిస్తోంది. యువ దర్శకుడు చక్రి తోలేటితో 'కొలై యుత్తిరి కాలమ్' అనే సస్పెన్స్ థ్రిల్లర్‌తోపాటు తాజాగా భరత్ కృష్ణమూర్తి అనే నూతన దర్శకునితో ఓ చిత్రం చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఆమె జర్నలిస్ట్ పాత్రను పోషిస్తోంది. తన కుటుంబమూలాల కోసం వెత్తుకుంటూ కొండలు, ఎడారుల వంటి వాటిని దాటుకొని పలు విదేశాల్లో కూడా తిరిగే పాత్రను ఆమె చేయనుంది. దాంతో జర్మని, ఫ్రాన్స్, మంగోలియా, చెక్ రిపబ్లిక్, పోలాండ్ వంటి దేశాల్లో ఈ చిత్రం షూటింగ్ జరగనుంది. దీని బడ్జెట్ 40కోట్లకు పైగా మాటే అంటున్నారు. మొత్తానికి ప్రస్తుతం నయన నూతన, యువ దర్శకుల పాలిట దేవతగా మారి, వరుస లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించడానికి ఒప్పుకుంటూ ఉండటంతో ఇక ఆమె పెద్దగా పెద్ద హీరోలతో చిత్రాలు చేసే అవకాశాలు కనిపించడం లేదు.