చిరు, దాసరిల మద్య ఇటీవల వరకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. కానీ ఈమధ్య కాలంలో చిరు-దాసరిల మధ్య అభిప్రాయభేదాలు తొలగిపోయాయంటున్నారు. గతంలో దాసరి చిరు, చరణ్‌లతోపాటు పలువురు మెగాహీరోలను ఉద్దేశించి ఇన్‌డైరెక్ట్‌గా ఎన్నో కామెంట్స్ చేశాడు. మెగా క్యాంపు హీరోలు కూడా దానికి సరైన సమాధానాలే ఇచ్చారు. కానీ ఇటీవల వేగంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన చిరు, దాసరిలు ముద్రగడ ఉద్యమం పుణ్యమా..! అని ఒకటై పోయినట్లు కనిపిస్తోంది. ఇటీవల అల్లు.. వీరిద్దరి మధ్య రాజీ జరిపినట్లు చెప్పుకుంటున్నారు. అందులో భాగంగానే తాను తన కుమారుడు శిరీష్ తో నిర్మించిన 'శ్రీరస్తు శుభమస్తు' సక్సెస్ మీట్ వేడుకకు కూడా దాసరినే ముఖ్యఅతిథిగా పిలిచాడు. ప్రస్తుతం చిరు హీరోగా, చరణ్ నిర్మాణంలో వస్తున్న 'ఖైదీ నెంబర్ 150' ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు సైతం దాసరే ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే. కాగా ఈ విషయంపై దాసరి స్పందించారు.
ఆయన మాట్లాడుతూ, చిరు నటించిన పలు బ్లాక్‌బస్టర్ చిత్రాల వేడుకకు ముఖ్యఅతిధిగా నేను హాజరయ్యాను. నేను ముఖ్యఅతిథిగా వచ్చిన చిరు చిత్రాలన్నీ పెద్ద విజయం సాధించాయి. చిరు ఫంక్షన్ అంటే అది నా సొంత ఫంక్షన్ వంటిది...అని అన్నారు. అదే సమయంలో చిరుకు, తనకు మద్య ఉన్న విభేదాల గురించి మాట్లాడుతూ.. ప్రతి కుటుంబంలోనూ విభేదాలు, అభిప్రాయభేదాలు సహజమే, నేను నా 50ఏళ్ల కెరీర్లో ఎందరో హీరోలను చూశాను. ఏదో ఒక సందర్భంగా వారిని విమర్శించినా.. ఏ హీరో కూడా పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. చిరు తన స్టార్‌డమ్‌ను ఎప్పుడో సాధించాడు, కొత్తగా ఆయన సాధించాల్సింది ఏమీ లేదు. అయితే రీఎంట్రీలో కూడా తనకు మునుపటి ఇమేజ్ ఉందని నిరూపించుకోవడానికి 'ఖైదీ..' చిత్రం పునాది అవుతుంది. ఇక చిరు, బాలయ్యల చిత్రాలు రెండు సంక్రాంతి పోటీలో ఉండటంపై మాట్లాడుతూ, సంక్రాంతికి మూడు సినిమాలను మోసే శక్తి ఉంది, చిరు, బాలయ్యల చిత్రాలు రెండు విజయవంతం అవుతాయి, దీనికి కారణం రెండూ విభిన్న జోనర్స్‌కు చెందిన చిత్రాలు కావడమే. ఏ హీరో అభిమానులు ఆ హీరో సినిమాను మొదటిరోజు చూస్తారు, రెండో రోజు ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కలిసి ఒకే చిత్రం చూస్తారు. చిరు తన కెరీర్ తొలినాళ్లలో ఎంత కష్టపడ్డాడో.. ఇప్పటికీ అంతే కష్టపడుతున్నాడు, తాజా చిత్రానికి కూడా చిరు బాగా కష్టపడ్డాడని విన్నాను. ఆరోగ్యకరమైన పోటీ ప్రతి రంగంలోనూ మంచిదే. చిరు, బాలయ్యల చిత్రాల మధ్య కూడా ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. నేను దర్శకునిగా వరుస చిత్రాలు చేస్తున్న సమయంలో రాఘవేంద్రరావుతో కూడా నాకు ఇలాంటి ఆరోగ్యకరమైన పోటీనే ఉండేది..అని తెలిపారు దాసరి.