హీరోలు కూడా నిర్మాతలుగా మారుతున్నారు. ఈ విషయంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్... అనే తేడా లేదు. ఇప్పుడు అన్నిభాషల హీరోలు ప్రొడ్యూసర్స్‌గా మారుతూ తాము హీరోలుగా నటించే చిత్రాలను, తమ ఫ్యామిలీ హీరోలతోనూ చిత్రాలు చేస్తున్నారు. మరికొందరు మరికాస్త ముందుకు వెళ్లి బయటిహీరోలతో కూడా సినిమాలు నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నారు. తెలుగులో ఇప్పటికే పవన్, చరణ్, మహేష్, కళ్యాణ్‌రామ్, నితిన్, నారా రోహిత్ వంటి వారు కూడా ప్రొడ్యూసర్స్ అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. ఇక ఎప్పుడో నిర్మాతగా మారిన బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ చిన్నహీరోలతో కాకుండా ఏకంగా ఇతర స్టార్స్‌తోనే భారీ బడ్జెట్‌తో చిత్రాలు నిర్మించడానికి సన్నద్ధం అవుతున్నాడు.
దీంతో మరో క్రేజీ కాంబినేషన్‌లో ఓ మూవీ రూపొందుతుండటం వారి అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. సల్మాన్‌కు మరో స్టార్ అక్షయ్‌కుమార్ మంచి మిత్రుడు. గతంలో సల్మాన్ అక్షయ్ చిత్రం 'ఫగ్లీ'లో ఓ పాటలో డ్యాన్స్ చేసి సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సల్మాన్ మరో బాలీవుడ్ నిర్మాత కరణ్‌జోహార్‌తో కలిసి సంయుక్తంగా అక్షయ్ హీరోగా ఓ చిత్రం నిర్మిస్తున్నాడు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి పంజాబీ దర్శకుడు అనురాగ్‌సింగ్‌కు డైరెక్షన్ బాధ్యతలు అప్పగించారు. ఈ దర్శకునికి ఏడేళ్ల గ్యాప్ తర్వాత మరలా ఓ బాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం రావడం విశేషం.