ఒకప్పుడు దర్శకులకి ఓ చిత్రం పెద్ద హిట్టయిందంటే వెంటనే పలు ఆఫర్లు వెళ్లువెత్తేవి. పలువురు నిర్మాతలు, హీరోలు వారి కోసం కర్చీఫ్‌లు వేసేసేవారు. కానీ ఆ హడావుడిలో వెంటవెంటనే పలు చిత్రాలను తొందరపడి ఒప్పుకోవడంతో వారు సింగిల్ వండర్ దర్శకులిగా మిగిలిపోయారు. ముఖ్యంగా ద్వితీయ విఘ్నాన్ని అధిగమించిన దర్శకులు చాలా తక్కువ. వారిలో రాజమౌళి, కొరటాల శివ వంటి కొందరిని ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రస్తుతం చాలామంది దర్శకులు తమ మొదటి చిత్రాలతోనే సంచలన విజయాలను నమోదు చేసినప్పటికీ రెండో చిత్రం కోసం తొందపడకుంగా, చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'తో అద్భుత విజయాన్ని సాధించిన మేర్లపాక గాంధీ చాలా గ్యాప్ తీసుకొని 'ఎక్స్‌ప్రెస్‌రాజా' చేశాడు. 'ఉయ్యాల.. జంపాల' తర్వాత విరించి వర్మ ఎంతో గ్యాప్ ఇచ్చి 'మజ్ను' చేశాడు.
'రన్‌రాజారన్'తో మంచి టాలెంట్ కలిగిన దర్శకునిగా పేరు తెచ్చుకున్న సుజీత్ సైతం తన రెండో చిత్రం ప్రభాస్‌తో చేయడం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. అదే దారిలో ప్రస్తుతం మరో దర్శకుడు కూడా నడుస్తున్నాడు. 'పెళ్లి చూపులు' వంటి అద్భుతమైన చిత్రాన్ని తీసిన కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్. లోబడ్జెట్‌లో రూపొందిన ఈ చిత్రం సంచలన కలెక్షన్లు సాధించింది. దీంతో ఆయనకు సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్‌బాబు నుండే కాకుండా అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత కింగ్ నాగార్జున నుండి కూడా పిలుపువచ్చింది. కానీ తన మొదటి చిత్రం విడుదలై ఆరునెలలైనా ఆయన ఇంకా తన తదుపరి చిత్రానికి కసరత్తులు చేయడంలోనే ఉన్నాడు. ఇంకా ఎవ్వరికీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. మరి ఇంత గ్యాప్ తీసుకున్న ఆయన తన రెండో చిత్రాన్ని విజయవంతం చేయగలడా? అదే ఊపు కొనసాగించగలడా? అనేవి వేచిచూడాల్సివుంది.