చిరంజీవికి ఎన్నో ప్రశంసలు వస్తుంటాయి. సినిమా చూశాక చాలా మంది బావుందని చెబుతుంటారు. కానీ ఆయనకు తొలి ప్రశంస, విమర్శ మాత్రం ఇంట్లోనే వస్తుందట. శ్రీమతి సురేఖ ఆయనకు తొలి అభినందన అందిస్తుంది. తొలి విమర్శ చేస్తుంది. ఆమె మాటల్లో నిజాయితీ ఉంటుంది కాబట్టి సురేఖ కామెంట్స్ ను చిరంజీవి పరిగణలోకి తీసుకుంటారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. స్టార్ గా ఎదుగుతున్నపుడే సురేఖతో ఆయనకు వివాహం జరిగింది. ఆ తర్వాత అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించి, సుప్రీమ్ హీరోగా, మెగాస్టార్ గా ఎదిగారు. సినిమా ప్రివ్యూలకు క్రమం తప్పకుండా సురేఖను తీసుకెళతారట. ఆమె నోటి వెంట వచ్చే మాటలను ఆసక్తిగా వింటారు. 'ఖైదీ నంబర్ 150' చిత్రానికి తొలి ప్రశంస సురేఖ నుండి వచ్చిందని చిరంజీవి చెప్పారు. అంతేకాదు ఈ సినిమా కోసం ప్రత్యేక ఇంటర్య్వూలు ఇస్తున్నపుడు తను ధరించిన షర్టు విషయంలో సూచన చేసిందని, బావుందని వేసుకున్న షర్టు బాలేదని చెప్పి మరొకటి ధరించమని చెప్పిందట. ఆమె చెప్పే సూచనను తాను గౌరవిస్తానని చిరు అన్నారు. ప్రతి మగవాడి విజయం వెనుక స్త్రీ ఉంటుందనే మాట చిరంజీవి విషయంలో నిజమే అని మరోసారి రుజువైంది.