నాటితరం హీరోలు ఒక దర్శకుడికి లేదా నిర్మాతకు ఒక్కసారి మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకునే దాకా నిద్రపోయేవారు కాదు. కానీ నేటితరం హీరోలు మాత్రం ఆ విషయాలను చాలా లైట్‌గా తీసుకుంటున్నారు. కొందరికి మాటిచ్చి... ఆ తర్వాత నో అని చెప్పకుండా సినిమాలను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తుండటం సహజంగా మారింది. కేవలం స్టార్స్ మాత్రమే కాదు.. యంగ్‌హీరోలు తీరు కూడా అలానే ఉంది. కాగా 'అష్టా చమ్మా, గోల్కోండ హైస్కూల్' వంటి మంచి చిత్రాలను తెరకెక్కించి, టాలెంట్ ఉన్న దర్శకునిగా పేరు తెచ్చుకున్నాడు డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ. ఆ తర్వాత ఆయన కెరీర్ కాస్త గాడితప్పినప్పటికీ తాను పరిచయం చేసిన నాని సహకరించడంతో ఆయన మరలా 'జెంటిల్‌మన్' చిత్రంతో మంచి విభిన్న చిత్రాన్ని అందించి మునుపటి ఫామ్‌లోకి వచ్చాడు.
కాగా 'ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో' చిత్రాల తర్వాత ఆచితూచి అడుగులేస్తున్న అక్కినేని నాగచైతన్య.. ఇంద్రగంటితో ఈ ఏడాది ఓ చిత్రం చేస్తానని హామీ ఇచ్చాడు. ప్రస్తుతం చైతూ తమ అన్నపూర్ణ బేనర్‌లో 'సోగ్గాడే...' చిత్ర దర్శకుడు కళ్యాణ్‌కృష్ణతో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే తన చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ఇంద్రగంటి భావించాడు. కానీ చైతూ సడన్‌గా రానా నిర్మాతగా ఆర్వీ మరిముత్తు అనే దర్శకునితో తెలుగు, తమిళభాషల్లో రూపొందే ఓ ద్విభాషా చిత్రం ఒప్పుకున్నాడు. దీంతో పాటు మరికొన్ని కొత్త కమిట్‌మెంట్స్ ఉన్నందున ఇంద్రగంటి చిత్రాన్ని ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టాడు. ఈ చిత్రం చేయడానికి మరో ఏడాదైనా పడుతుందని ఇంద్రగంటికి తెలపడంతో ఆయన కూడా చైతూ చిత్రాన్ని లైట్ తీసుకొని ఆలోపు సమయం వృథా చేయకుండా మరో విభిన్న చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిషోర్, అడవిశేషు వంటి ముగ్గురు చిన్న హీరోలతో కలిసి ఓ చిత్రం చేయడానికి రెడీ అయ్యాడు. ఈ చిత్రాన్ని త్వరలో పట్టాలెక్కించేందుకు సిద్దమవుతున్నాడని సమాచారం.