కలెక్షన్లలో దూసుకుపోతున్న భారీ చిత్రాలు 'ఖైదీ', 'శాతకర్ణి' సినిమాలకు థియేటర్ల తగ్గింపు ప్రమాదం రానుంది. అత్యధిక థియేటర్లు ఆక్రమించిన ఈ సినిమాలు రికార్డ్ లు క్రియేట్ చేస్తునప్పటికీ, మరో వారంలో విడుదలయ్యే 'సింగం 3' కోసం కొన్నింటిని ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. అంటే విడుదలైన రెండు వారాలకు ప్రదర్శించే థియేటర్లను కుదిస్తారన్నమాట. మాస్ ఇమేజ్ ఉన్న సూర్య నటించిన 'ఎస్ 3' సిరీస్ లో భాగంగా వస్తున్న 'సింగం 3' కోసం ఇప్పటికే బయ్యర్లు థియేటర్లు రిజర్వు చేసుకున్నారు. 'ఖైదీ', 'శాతకర్ణి' సినిమాలకు మొదటివారమే అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి కనుక, రెండో వారాంతానికి ఇవి పడిపోతాయని అంటున్నారు.
ఈ ప్రభావం సోమవారం నుండే కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అడ్వాన్స్ బుకింగ్ కాకుండా, కొన్ని చోట్ల రన్నింగ్ ఫుల్స్ అవుతున్నాయని తెలిసింది. అలాగే కేవలం ఎనభైశాతం అక్యుపెన్సీ మాత్రమే ఉందని, క్రమంగా ఇది కూడా తగ్గుతోందని అంటున్నారు. రెండు సినిమాలకు ఓపనింగ్స్ భారీగా రావడం వల్ల ఇప్పటికే బయ్యర్లు లాభాల బాటలో ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకో తిరకాసు ఉంది. ఖైదీ కోసం కేటాయించిన థియేటర్ల పర్యవేక్షణ అల్లు అరవింద్ అండ్ కోకు ఉంది కాబట్టి, ఆయా థియేటర్లకు అంత త్వరగా టర్మినేషన్ ఇచ్చే అవకాశాలు తక్కువ. పైగా లాంగ్ రన్ కోసం అంటే కనీసం యాభై రోజుల ప్రదర్శన రికార్డ్ కోసం ప్రయత్నించే అవకాశాలున్నాయి. ఇకపోతే 'శతమానం భవతి' స్టడీగా ఉంటుంది. థియేటర్లు దిల్ రాజు చేతిలోనే ఉన్నాయి కాబట్టి, అనూహ్యంగా కలెక్షన్లు తగ్గితే కానీ ఆయన మరో సినిమా కోసం ఖాళీ చేయరనే మాట వినిపిస్తోంది. ఈ క్రమంలో సింగం 3 కోసం ఎన్ని థియేటర్లు సిద్ధంగా ఉంటాయనేది స్పష్టంగా తెలియదు.