మురుగదాస్ చిత్రం విషయంలో మహేష్ మాట తప్పుతున్నాడు. కానీ దీనికి కారణం మాత్రం దర్శకుడే అంటున్నారు. ఎప్పుడో షూటింగ్ ప్రారంభించుకున్న ఈ చిత్రం టాకీపార్ట్ మొత్తాన్ని డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేస్తానని మురుగదాస్ హామీ ఇచ్చాడు. కానీ ఇప్పటికీ టాకీపార్ట్ పూర్తికాలేదు. అయితే దీనికి సరైన కారణమే కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో పూర్తి చేస్తున్నారు. చాలా మంది ద్విభాషా చిత్రమని స్టేట్‌మెంట్స్ ఇస్తుంటారు కానీ తీరా సినిమా చూస్తే ఒకేభాషా నటీనటులే కనిపిస్తూ అది డబ్బింగ్ చిత్రంగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ మురుగదాస్-మహేష్‌లు మాత్రం ఆ అపవాదు తమకి రాకుండా ఎంతో కష్టపడుతున్నారు. హీరో మహేష్, హీరోయిన్ రకుల్, విలన్ ఎస్.జె.సూర్యలు రెండు భాషల్లోనూ కనిపిస్తున్నారు. కానీ ఇతర కామెడీ ఆర్టిస్ట్‌లను, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లను మాత్రం రెండు భాషలకు వేర్వేరుగా ఎంచుకుంటున్నారు. అందువల్లే ఈ చిత్రం ఆలస్యమవుతోందని తెలుస్తోంది. ఇక 'పెళ్లిచూపులు' చిత్రంలో తన కామెడీతో అదరగొట్టిన ప్రియదర్శి తెలుగు వెర్షన్‌లో మహేష్‌కు సపోర్టింగ్ క్యారెక్టర్‌లో హాస్యం పండిస్తుండగా, అదే పాత్రను తమిళంలో స్టార్ కమెడియన్‌గా ఎదుగుతున్న యువ హాస్యనటుడు ప్రేమ్‌జీ ఆ పాత్రను పోషిస్తున్నాడు. మధ్యలో నూతన ఏడాది సందర్బంగా, మరో ఒకటి రెండు సార్లు మహేష్ ఈ చిత్రం షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చినప్పటికీ ఈ చిత్రం షూటింగ్‌లో నిరంతరం గడుపుతున్నాడు. ఈనెల 30 వతేదీ వరకు హైదరాబాద్‌లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో మహేష్‌తో పాటు రకుల్, సూర్యలు కూడా పాల్గొంటున్నారు. ప్రస్తుతం అమీర్‌పేటలోని జెనెటిక్స్ బిల్డింగ్‌లో ఈచిత్రంలోని కీలక సన్నివేశాలను నైట్ ఎఫెక్ట్‌లో షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత ముంబై, పూణెలలో జరిగే చిన్నపాటి ప్యాచ్‌వర్క్ షెడ్యూల్స్‌తో ఈ చిత్రం టాకీపార్ట్ మొత్తం పూర్తవుతుంది. ఫిబ్రవరిలో విదేశీ లోకేషన్లలో పాటలను చిత్రీకరించడంతో చిత్రానికి గుమ్మడికాయ కొట్టనున్నారు. మొత్తానికి ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నారు. కాగా ఈ చిత్రం టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌తోపాటు టీజర్‌ను కూడా జనవరి26న విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.