ఆమధ్య ప్రస్తుతం టాప్ కమెడియన్ అయిన 30ఇయర్స్ పృథ్వీ చిరు 150వ చిత్రం 'ఖైదీ...' చిత్రంలో తన పాత్రను ఎడిట్ చేయడంతో ఫేస్‌బుక్‌లో తన ఆవేదన వెలిబుచ్చాడు. ఆ తర్వాత మాట మార్చి తాను అలా చెప్పలేదని, దానిని మీడియా వక్రీకరించిందని తేల్చేశాడు. కాగా తాజాగా ఆయన తనకు రాజమౌళి తీస్తున్న 'బాహుబలి2'లో అవకాశం వచ్చిందని, తాను దేవసేన అనుష్కకు మంత్రి పాత్రను పోషిస్తున్నానని తెలిపాడు. ఈ క్యారెక్టర్ చిన్నదే అయినా ఎంతో బాగుంటుందని, ఇందులో తాను కామెడీ పాత్రను కాకుండా సీరియస్ పాత్రను చేస్తున్నానని తెలిపాడు. అయితే ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి ఈ చిత్రంలోని పాత్రల గురించి, సినిమా విడుదలకు ముందు ఎవ్వరూ బయటకు చెప్పకూడదనే షరత్తుని విధించాడు. కాబట్టి ఈ చిత్రం గురించి ఎవ్వరూ ఎక్కడా రివీల్ చేయడం లేదు. మరి రాజమౌళి అనుమతి తీసుకునే పృథ్వీ ఈ విషయాన్ని బయటపెట్టాడా? లేక 'ఖైదీ...' చిత్రం విషయంలోలాగా ఇది కూడా మీడియా సృష్టేనంటాడా? అనే సెటైర్లు బాగా వినిపిస్తున్నాయి. మొత్తానికి పృథ్వీని పనిగట్టుకుని ప్రమోట్ చేసి, మరలా ఆయన మీడియాపైనే నిందలు వేసే పద్దతి మానుకుంటే గానీ ఆయనకు మీడియా నుండి మునుపటి మద్దతు ఉండదనేది వాస్తవం.