'ఆనంద్' చిత్రంతో ఓ మంచి కాఫీలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు శేఖర్‌కమ్ముల. చాలా తక్కువ బడ్జెట్‌తో ఎక్కువగా కొత్తవారిని తీసుకొని, తనకున్న పరిధిలో మంచి చిత్రాలను తెరకెక్కిస్తూ వస్తున్నాడు ఆయన. కాగా ఆయనకు ఈమధ్య సరైన సక్సెస్‌లేదు. ప్రస్తుతం ఆయన తనదైన శైలిలోనే మెగాహీరో వరుణ్‌తేజ్‌తో 'ఫిదా' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలోని వరుణ్ ఫస్ట్‌లుక్‌కి ఆందరూ ఫిదా అయిపోతున్నారు. కానీ శేఖర్‌కమ్ముల ఒకే విధమైన చిత్రాలను తీస్తూ పోవడంతో ఆయన చిత్రాలంటే ప్రేక్షకులకు కాస్త మొనాటనీ వచ్చింది. సరైన హిట్స్‌లేని సమయంలో బాలీవుడ్ హిట్ మూవీ 'కహాని'ని ఆయన తెలుగులో నయనతారతో 'అనామిక'గా తీశాడు. ఈచిత్రం కూడా సరిగ్గా ఆడలేదు. అలా ఒత్తిడి గురై, ఓ రీమేక్ చిత్రం చేయడం శేఖర్‌కమ్ములను అభిమానించే ప్రేక్షకులకు మింగుడు పడలేదు. దీంతో ఆయనతో ఒకరిద్దరు స్టార్స్ చిత్రాలు చేస్తామని ఎప్పుడో హామీ ఇచ్చినప్పటికీ వారు ధైర్యం చేయలేకపోతున్నారు.
ఇక 'గమ్యం'తో ప్రస్థానం మొదలుపెట్టిన క్రిష్‌ది కూడా విభిన్నశైలే. కానీ తాను తీసే ప్రతి చిత్రంలోనూ ఆయన వైవిధ్యానికి చోటు ఇస్తూనే, ఎన్నో కొత్త కొత్త ఆలోచనలతో చిత్రాలు చేస్తూ వచ్చాడు. 'కంచె' వరకు ఆయన అలాంటి చిత్రాలే చేస్తూవచ్చాడు. ఆయన 'ఠాగూర్'ని బాలీవుడ్‌లో 'గబ్బర్'గా తీసి విమర్శలు మూటగట్టుకున్నాడు. కానీ బాలయ్యతో చేసిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం కూడా విభిన్న కథాంశమే అయినప్పటికీ బాలయ్యకున్న ఇమేజ్‌కు అనుగుణంగా ఈ చిత్రంలో ఆయనను ఎంతో పవర్‌ఫుల్‌గా, సంభాషణల పరంగా కూడా బాలయ్యకు సూటయ్యే విధంగా తీసి మొదటిసారి పెద్ద కమర్షియల్ బ్రేక్‌ను అందుకున్నాడు. సో... ఇప్పటి నుంచి క్రిష్ వేసే ప్రతి అడుగు ఎంతో కీలకమైనది. తనకు వచ్చిన కమర్షియల్ సక్సెస్‌ను నిలబెట్టుకుంటూనే తన పంథాను కూడా విడువకుండా ఆయన తన దర్శకప్రస్థానాన్ని కొనసాగిస్తాడో? లేక వన్ మూవీ వండర్‌గా మిగిలిపోతాడో? వేచిచూడాల్సివుంది.