Advertisementt

ఈ 'కాపు త్రయం' వ్యూహమేంటి...?

Sat 21st Jan 2017 11:28 AM
kapu leaders,pawan kalyan,janasena,chiranjeevi,congress,dasari narayana rao,ysrcp,tdp,chandrababu naidu  ఈ 'కాపు త్రయం' వ్యూహమేంటి...?
ఈ 'కాపు త్రయం' వ్యూహమేంటి...?
Advertisement
Ads by CJ

మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌, దర్శకరత్న దాసరి నారాయణరావులను సినీ ఫీల్డ్‌లో పేరున్న 'కాపు త్రయం'గా చెప్పుకోవచ్చు. కాగా వీరి భవిష్యత్తు వ్యూహమేంటి? అనే విషయంలో అనేక వార్తలు షికారు చేస్తున్నాయి. వాస్తవానికి మెగాహీరోలకు, దాసరికి మధ్య ఎప్పటి నుంచో విభేదాలున్నాయి. కానీ వారు మాత్రం అవేమీ లేనట్లుగా మభ్యపెట్టాలని చూస్తుంటారు. కానీ చిరు, దాసరిలతో పాటు పవన్‌ కూడా ప్రస్తుతం ఒకటయ్యారు. పవన్‌.. దాసరికి ఓ చిత్రం చేస్తానని మాట ఇవ్వడం, ముద్రగడ కాపు ఉద్యమం పుణ్యమా అని ముద్రగడే చిరు, దాసరిల మధ్య సయోధ్య కుదిరించాడనే వార్తలు బలంగానే వినిపిస్తున్నాయి. ఇటీవల మెగాఫ్యామిలీ హీరోల ఫంక్షన్లకు దాసరి హాజరవుతున్నారు. ఇక 'ఖైదీ నెంబర్‌ 150' ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌కు ముఖ్యఅతిధిగా హాజరైన దాసరి చిరుపై ఎక్కడలేని ప్రేమ చూపించారు. అదే అదనుగా చిరు కూడా దాసరిని ప్రశంసలతో ముంచెత్తారు. వీటన్నింటి నేపథ్యంలో ఈ ముగ్గురు కాపు నాయకుల రాజకీయ భవితవ్యం, భావి ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి? అనే అంశం అందరికీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

చిరు 'ప్రజారాజ్యం' పార్టీని పెట్టినప్పుడు చిరు, పవన్‌లు కలిసి ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం, దాంతో ఆ పార్టీ కాపు ఓట్లను గణనీయంగానే పొందడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న దాసరి తర్వాత ఆ పార్టీకి దూరమయ్యాడు. కానీ చిరు తన 'ప్రజారాజ్యం' పార్టీని ఎప్పుడైతే కాంగ్రెస్‌కు తాకట్టుపెట్టాడో అప్పుడు కాపులు కూడా చిరు నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయారు. అది పవన్‌కి కూడా నచ్చలేదు. దాంతో పవన్‌తో పాటు కాపులలోని ఓ బలమైన వర్గం చిరుకు దూరమయింది. కిందటి ఎన్నికల్లో పవన్‌ 'జనసేన' పార్టీని స్థాపించి, టిడిపి-బిజెపి కూటమికి మద్దతు ఇచ్చాడు. దాంతో టిడిపి దీనివల్ల భారీగానే లాభపడింది. ప్రస్తుతం పవన్‌ బిజెపిని విమర్శిస్తూ టార్గెట్‌ చేస్తున్నాడు. కానీ టిడిపిపై మాత్రం పెద్దగా విమర్శలు సంధించడం లేదు. అదే సమయంలో రాష్ట్రంలోని పలు సమస్యలపై పవన్‌ గళమెత్తుతున్న ప్రతిసారి టిడిపి అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం తన మంత్రులు, ఇతర నాయకులు పవన్‌ని విమర్శించవద్దని మౌఖిక ఆదేశాలు ఇచ్చాడని సమాచారం. దాంతో పాటు పవన్‌ ఏసమస్య మీద పెదవి విప్పితే ఆ సమస్యలను వెంటనే పరిష్కరించేలా చంద్రబాబు నడుచుకుంటున్నాడు. ఇతర పార్టీ నాయకుల విమర్శలను బేఖాతరు చేసే అలవాటులేని బాబు.. పవన్‌ విషయంలో మాత్రం బాగా స్పందిస్తున్నాడు. దీనిని బట్టి పవన్‌ బిజెపికి దూరమైనప్పటికీ ఆయన స్థాపించిన 'జనసేన'ను వచ్చే ఎన్నికల్లో కూడా తమకు భాగస్వామిని చేసుకోవాలని, తద్వారా పవన్‌ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకోవాలనేది బాబు వ్యూహంగా కనిపిస్తోంది. 

ఇక చిరంజీవి, దాసరిలు కూడా పొలిటికల్‌గా యాక్టివ్‌గా లేరు. కానీ ఈ ఇద్దరు ఇప్పుడు బాగా కలిసిపోవడం వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌జగన్మోన్‌రెడ్డికి మింగుడు పడటం లేదు. ముందుగా కాంగ్రెస్‌పై కోపంతో ఉన్న దాసరిని వైసీపీలోకి తీసుకోవాలని జగన్‌ భావించాడు. అందుకు దాసరి కూడా సన్నద్దమయ్యాడు. కానీ దాసరి కూడా ఇప్పుడే వైసీపీలోకి పోకుండా చిరుతో కలిసి భవిష్యత్తు వ్యూహరచన చేస్తున్నాడు. కాంగ్రెస్‌లో చిరు ఎంత కాలం ఉంటాడు? అనేది కూడా ప్రశ్నార్ధకంగానే ఉంది. మరి చిరు కాంగ్రెస్‌లోనే ఉండదలిస్తే, దాసరి వైసీపీలోకి వెళ్లిపోవడం ఖాయం. అలా జరిగితే పవన్‌ 'జనసేన' వచ్చే ఎన్నికల్లో కూడా టిడిపితోనే జతకడితే, టిడిపికి పవన్‌, కాంగ్రెస్‌కు చిరు, వైసీపీకి దాసరి చేరుతారు. దాంతో ఆ సామాజికవర్గం ఓట్లు ఖచ్చితంగా చీలిపోతాయి. కాబట్టి దాసరి ప్రస్తుతం రాజకీయంగా చిరుని, పవన్‌ని ఏకం చేయడానికి కృషి చేస్తున్నాడు. దీనికి ముద్రగడ అనుమతి కూడా ఉంది. మరి వచ్చే ఎన్నికల నాటికి చిరు, దాసరిలు కలిసి పవన్‌ నాయకత్వంలోని 'జనసేన'లోకి వస్తే కాపులందరూ ఆ పార్టీతోనే కలిసి ఉండే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి కాపు ఓట్లు చీలకుండా ఉండాలంటే ఈ ముగ్గురు కలిసి ఉండాలని ఆ కులం వారు భావిస్తున్నారు. అయితే ఒకప్పుడు తమను టార్గెట్‌ చేసిన దాసరితో చిరు.పవన్‌లు సన్నిహితంగా ఉండటం మాత్రం మెగాభిమానులకు ఇష్టంలేదనే అర్ధమవుతోంది. రాజకీయాలలో కూడా శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న సంగతి తెలిసిన వారు మాత్రం వచ్చే ఎన్నికల నాటికి ఈ ముగ్గురి దారులు ఎలా ఉండబోతున్నాయా? అని ఆసక్తిగా తాజా పరిణామాలను పరిశీలిస్తున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ, కాంగ్రెస్‌లు కలసిపోతే చిరు, దాసరిలు మాత్రం ఒకటయ్యే అవకాశం ఉంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ