సౌతిండియాలో మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లో సంచలన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. ఆయన తన కెరీర్‌లో ఇప్పటికే ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు. అన్ని తరహా చిత్రాలకు, దాదాపు అందరూ హీరోల చిత్రాలకు ఆయన మ్యూజికల్ హిట్స్‌ను అందించినప్పటికీ ఆయనకు మెగాహీరోలతో మాత్రం విడదీయరాని బంధం ఉంది. 'ఆర్య' నుంచి తాజాగా 'ఖైదీ నెంబర్ 150' చిత్రం వరకు ఆయన మెగాహీరోలతో దాదాపు 15 చిత్రాల దాకా సంగీతం అందించాడు. 'శంకర్‌దాదా సిరీస్', 'గబ్బర్‌సింగ్ సిరీస్', 'ఆర్య సిరీస్', త్రివిక్రమ్‌తో 'జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి' ఇలా ఎన్నో చిత్రాలను దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక సమ్మర్‌లో విడుదలకు సిద్దమవుతోన్న దిల్‌రాజు-బన్నీల 'డిజె' కి కూడా ఆయనే సంగీతం అందిస్తున్నాడు. మొత్తానికి దేవిశ్రీ తనకు బాగా అనుబంధం ఉన్న హీరోలు, దర్శకనిర్మాతలకే ఎక్కువ హిట్స్‌ను అందించాడు.
తాజాగా ఆయన మరో మెగాహీరో వరుణ్‌తేజ్ హీరోగా భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్,ఎన్.ప్రసాద్ నిర్మాణంలో కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నాడు. మరోపక్క బాలయ్య-క్రిష్‌లు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' నుంచి కీలక సమయంలో దేవిశ్రీ బయటకు వచ్చాడు. అదే సమయంలో ఆయన చిరు 'ఖైదీ నెంబర్ 150'కి మాత్రం అద్భుతమైన ట్యూన్స్‌ను ఇచ్చాడు. 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం నుంచి ఆయన బయటకు రాగానే ఈ విషయం ఆ చిత్రంపై ఎంతో కొంత ప్రభావం చూపిస్తుందని అందరూ భావించారు. కానీ చిరంతన్‌భట్ మాత్రం ఆ చిత్రానికి ఆ లోటు కనిపించకుండా చేయడంలో సక్సెస్ అయ్యాడు. మొత్తానికి దేవిశ్రీ మాత్రం తాను మెగాపక్షపాతినని నిరూపించుకున్నాడంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.