జల్లికట్టుకు టాలీవుడ్ స్టార్స్ మహేష్ బాబు, పవన్ కల్యాణ్ అనుకూలంగా ట్వీట్ చేయడం ఆసక్తి కలిగిస్తోంది. పవన్ రాజకీయాల్లో ఉన్నాడు. జనసేన పార్టీకి నేత కాబట్టి స్పందించాడని అనుకోవచ్చు. కానీ వివాదాలకు దూరంగా ఉండే మహేష్ కూడా జల్లికట్టుకు అనుకూలంగా స్పందించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎవరి సూచనతో ఆయన ఇలా చేశారనే దానిపై పలురకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.
జల్లికట్టుకు కోలీవుట్ స్టార్స్ మద్దతు పలికారు. వారు స్థానికులు కాబట్టి అనుకూలంగా మాట్లాడుతున్నారని అనుకోవచ్చు. తమిళనాడులోని యువత జల్లికట్టు ఉద్యమాన్ని నడుపుతోంది. అనుకూలంగా లేకపోతే అది తమిళ సినిమా ప్రదర్శనలపై పడే ప్రమాదం ఉంది కాబట్టి కోలీవుట్ స్టార్స్ కు గత్యంతరం లేకపోయింది. కానీ మన మహేష్ బాబు టాలీవుడ్ హీరో ఆయన ఎందుకు వేలు పెట్టాడు? అంటే దీనికి కారణం ఉందనే మాట వినిపిస్తోంది. మహేష్ తమిళ సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మురగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం తమిళ, తెలుగు భాషల్లో నిర్మాణవుతుంది. తమిళంలో కూడా పాగా వేయాలని, తద్వారా తన మార్కెట్ విస్తృత పరుచుకోవాలనే ఆలోచన ప్రిన్స్ కు ఉంది. అందువల్ల భవిష్యత్తు ప్రణాళికలో భాగంగానే జల్లికట్టుకు మద్దతు ఇవ్వడం ద్వారా అక్కడి ప్రేక్షకుల్లో అనుకూలత సాధించే ప్రయత్నంతోనే మహేష్ ఇలా స్పందించాడని ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ విషయంలో సన్నిహుతుల వద్ద సంప్రదింపులు జరిపాకే మహేష్ ట్వీట్ చేశాడని అంటున్నారు.