ఏదో ఒకరి పైనా.. వివాదాలు సృష్టించైనా సరే... వార్తల్లో నిలబడాలని, తమ చిత్రాలకు ఫ్రీ పబ్లిసిటీ వచ్చేలా చూడాలని నేటితరం మేకర్స్ భావిస్తున్నారు. కష్టపడకుండానే రాత్రికి రాత్రి స్టార్స్‌గా వార్తల్లో నిలబడాలనుకుంటున్నారు. ఇటీవల నూతన ఏడాది కానుకగా జనవరి1వ తేదీన నూతన దర్శకుడు దాసరి సాయిరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ద్యావుడా' చిత్రం టీజర్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఇందులో హిందువులు పవిత్రంగా భావించే ఆదిదేవుడైన శివలింగాన్ని బీరుతో అభిషేకం చేస్తూ, సిగరెట్లతో దీపం వెలిగిస్తూ, శ్రీవేంకటేశ్వరస్వామి పటాన్ని నేలకేసి పగలకొడుతూ.. ఇలా హిందువుల మనోభావాలను కించపరిచేలా పలు దారుణమైన సీన్స్ చూపించారు. దీంతో భజరంగ్ దళ్‌తో సహా కొన్ని హిందూసంస్థలు ఈ చిత్రం టీజర్‌పై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ చిత్రం దర్శకుడు దాసరి సాయిరామ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కడపకు చెందిన నిర్మాత కోసం గాలిస్తున్నారు. కానీ దర్శకుడు మాత్రం 'కర్ణాటకలోని ఉజ్జయినీలో శివలింగాన్ని మద్యంతో, సిగరెట్లతో ఆరాధించే సంస్కృతి ఉందంటూ వాదిస్తున్నాడు. ఒక ఈ చిత్రం టీజర్‌ను యూట్యూబ్ నుంచి తొలగించామని వాదిస్తున్నాడు. కానీ ఆ టీజర్ ఇప్పటికీ యూట్యూబ్‌లో దర్శనమిస్తూనే ఉంది. మరోపక్క తాజాగా 'ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు..!' అనే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ వారు 'ఎ' సర్టిఫికేట్ ఇచ్చారు. కాగా ఈ చిత్రం స్టిల్స్‌ను చూస్తేనే ఎంతో అసభ్యంగా, అశ్లీలం మోతాదు మించి కనిపిస్తోంది. స్టిల్స్ సే ఇలా ఉంటే ఇక సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో ఆలోచించుకోవచ్చు. 'సి' గ్రేడ్ మూవీలా రూపొందుతున్న ఈ చిత్రం స్టిల్స్‌పై ఇప్పటికే తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇలాంటి చిత్రాలకు అడ్డుకట్టపడేది ఎప్పుడో ఆ దేవుడికే తెలియాలి.