బి.గోపాల్ తర్వాత ఆ స్థాయిలో మాస్‌హీరోలను ప్రజెంట్ చేయగలిగిన నేటితరం దర్శకుల్లో వినాయక్, బోయపాటిలు ముందుంటారు. అందుకే మాస్ హీరోలుగా ఎదగాలని కోరుకునే ప్రతి హీరో వీరి చిత్రాలలో అవకాశం ఎప్పుడొస్తుందా? అని నిరీక్షిస్తూ ఉంటారు. కాగా మెగాస్టార్‌తో ఆల్‌రెడీ 'ఠాగూర్' వంటి బ్లాక్‌బస్టర్ అందించి, తాజాగా ఆయన 150వ చిత్రంగా ఎందరో దర్శకులను కాదని తనకు మెగాస్టార్ ఇచ్చిన అరుదైన అవకాశాన్ని వినాయక్ 'ఖైదీ నెంబర్150'తో మరోసారి నిరూపించుకున్నాడు. 'అఖిల్' వంటి డిజాస్టర్ తర్వాత వినాయక్‌ను నమ్మి ఈ ప్రాజెక్ట్‌ను ఆయన చేతిలో పెట్టిన విషయంలో ఆయనపై మెగాక్యాంపుకి ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. కాగా యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌తో 'ఆది'తో పరిచయమై, 'సాంబ, అదుర్స్' చిత్రాలతో స్టార్ డైరెక్టర్ హోదాను తెచ్చుకున్న వినాయక్ బాలయ్యతో 'చెన్నకేశవరెడ్డి' చిత్రం చేసినా ఇది పెద్దగా ఆడలేదు. దీంతో ఆయనపై నందమూరి డైరెక్టర్ అనే పేరు పడింది. కాగా పలుసార్లు యంగ్‌టైగర్ పబ్లిగ్గా, తన బాబాయ్‌తో మరో చిత్రం చేయాలనే కాక తన అన్నయ్య కళ్యాణ్‌రామ్‌తో కూడా చిత్రాలు చేయమని వినాయక్‌ను కోరాడు. అలాంటి సమయంలో వినయ్ మీద మెగాక్యాంపుకి కన్నుపడింది.
అదే కోవలో ఆయన బన్నీ,చరణ్‌లతో కూడా చిత్రాలు చేశాడు. బన్నీకి అనుకున్న స్థాయి హిట్ ఇవ్వలేకపోయినా చరణ్‌తో మాత్రం ఫర్వాలేదనిపించాడు. కాగా ప్రస్తుతం ఆయన మరో మెగాఫ్యామిలీ హీరోతో చిత్రం చేయనున్నాడనే వార్తలు వస్తున్నాయి. 'ఖైదీ నెంబర్ 150' తర్వాత ఆయన దర్శకత్వం వహించే చిత్రం ఏమిటా? అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్‌తో 'అదుర్స్2, దానవీరశూరకర్ణ' చిత్రాలు కూడా లిస్ట్‌లో వినిపించాయి. కానీ మెగాక్యాంపు మాత్రం వినయ్‌ని తమ కాంపౌండ్‌లోనే కట్టేయాలనే ఆలోచనలో ఉన్నట్లు అర్ధమవుతోంది. మెగా మేనల్లుడిగా పరిశ్రమకు పరిచయమై, అతి తక్కువ చిత్రాలతోనే మాస్‌లో ఫాలోయింగ్ తెచ్చుకున్న మెగా మేనల్లుడు, సుప్రీంస్టార్‌గా ఎదుగుతున్న సాయిధరమ్‌తేజ్‌తో వినాయక్ త్వరలో ఓ చిత్రం ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సాయి కూడా వినాయక్ చేతిలో పడితే ఇక తనకు తిరుగుండదని, ఈ ప్రాజెక్ట్ పట్ల ఎంతో ఉత్సుకతో ఉన్నాడట. ఇక ఎప్పటినుంచో వినాయక్.. పవన్‌తో కూడా ఓ చిత్రం చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పవన్, వరణ్‌తేజ్, అల్లు శిరీష్‌లతో కూడా చిత్రాలు చేస్తే మెగాక్యాంపు హీరోలందరితో చిత్రాలు చేసిన ఘనత వినాయక్‌కు దక్కుతుంది.మరి ఆయా చిత్రాలకు కూడా మెగాక్యాంపు వినాయక్‌కి అవకాశం ఇచ్చిన తర్వాతనే ఆయన్ను వదులుతారనే సెటైర్లు వినిపిస్తున్నాయి.