నిజమే... మంచు విష్ణుని ఇప్పుడందరూ 'లక్కున్నోడు' అనే గాక దిమాక్కున్నోడు అని కూడా ఒప్పుకుంటున్నారు. అదే సమయంలో స్టార్ సూర్య మాత్రం అన్‌లక్కీఫెలోగా మారిపోయి.. అయ్యో...పాపం.. అనిపించుకున్నాడు. హరి దర్శకత్వంలో సూర్య నటిస్తున్న 'ఎస్3' చిత్రాన్ని దీపావళికి అనుకొని కానీ తమ్ముడు కార్తి 'కాష్మోరా' కోసం డిసెంబర్‌కు వాయిదా వేశారు. ఆ తర్వాత డిసెంబర్‌లో 'ధృవ' కోసం మరో వారం వాయిదా వేశారు. ఇక అమ్మ జయలలిత మరణం, వరదలు వంటి పలు సమస్యల వల్ల జనవరి 26న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అది కూడా 'జల్లికట్టు' కారణంగా వాయిదా పడటంతో మంచి కోసం పోతే సూర్యకు చెడెదురైంది.. అన్నట్లు ఉంది.
వరుస చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్న ఈ రోజుల్లో ఓ హీరోకు సోలో రిలీజ్ దొరకడం కష్టమే. వాస్తవానికి మంచు విష్ణు 'గీతాంజలి' దర్శకుడు రాజ్‌కిరణ్ డైరెక్షన్‌లో చేస్తున్న 'లక్కున్నోడు' చిత్రాన్ని ఫిబ్రవరి3న రిలీజ్ చేయాలని భావించారు. నాని 'నేను..లోకల్' చిత్రంతోపాటు మోహన్‌లాల్ 'కనుపాప'చిత్రాలు కూడా అదే రోజున విడుదలకు ముస్తాబవుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో విష్ణు తన దిమాకును చూపించాడు. సినిమాను ఓ వారం ముందుగానే అంటే జనవరి26నే రిలీజ్ చేస్తున్నాడు. మరి సినిమా విజయంలో కూడా ఆయనకు ఈ 'లక్కు' కలిసి వచ్చి 'లక్కున్నోడు' గా నిరూపించుకుని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడో లేదో చూడాలి.