అద్భుత సాంకేతిక పరిజ్ఞానంతో చిత్రాలను విజువల్ వండర్స్‌గా తీర్చిదిద్దినప్పటికీ అందుకు తగ్గ మంచి థియేటర్లు లేకపోతే ఆ కష్టం ప్రేక్షకులకు చేరువకాలేక బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఇక ప్రస్తుతం సౌత్ ఇండియన్ దిగ్గజ దర్శకులైన రాజమౌళి, శంకర్లు ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తమ చిత్రాలను చెక్కుతున్నారు. 'బాహుబలి, రోబో' వంటి కళాఖండాలను 'బాహుబలి-ది కన్‌క్లూజన్', '2.0'లతో మునుపటి భాగాల కంటే 100రెట్లు కనువిందుగా, వీనులవిందుగా, అత్యద్భుత సాంకేతిక పరిజ్ఞానంతో హాలీవుడ్ టెక్నీషియన్స్ సేవలు ఉపయోగించుకుంటూ ముందుకు వెళుతున్నారు.
ఈ రెండు చిత్రాలను 4కె టెక్నాలజీతో తీస్తున్నారు. అలాంటి టెక్నాలజీకి అనుగుణంగా మన థియేటర్లలోని ప్రొజెక్టర్లు లేవు. వాటిని సమకూర్చుకోవాంటే ఒక్కో థియేటర్‌కు కనీసం కోటిరూపాయలు అదనంగా ఖర్చవుతుంది. అయినా సరే ఈ టెక్నాలజీని అందుబాటులోకి తేవడానికి పలు మల్టీప్లెక్స్ థియేటర్ల యజమానులు కేవలం ఈ రెండు చిత్రాల కోసమే దేశవ్యాప్తంగా సిద్దపడుతుండటం విశేషం. ఇక 'బాహుబలి2' ఏప్రిల్ 28న, '2.0' చిత్రం దీపావళి కానుకగా విడుదలకానున్నాయి. ఈ ఆధునిక హంగులు కలిగిన థియేటర్లు మహానగరాలకే కాకుండా నగరాలకు, ప్రతి పట్టణానికి ఒక్క థియేటర్ అయినా ఉంటే ఇక ప్రేక్షకులకు అవి మరుపురాని చిత్రాలుగానే మిగిలిపోతాయి. ఆడియన్స్ టికెట్ కోసం ఖర్చుపెట్టే ప్రతిపైసా, నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్స్ పడే కష్టాలకు సరైన ప్రతిఫలం లభించినట్లు అవుతుంది.