భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పెద్ద నోట్లు అనుకుంటున్న పాతనోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త నోట్లను ఏర్పాటు చేశాడు. అందుకోసం ఓ రెండు నెలల పాటు సామాన్యుడు అష్ట కష్టాలు పడిన విషయం తెలిసిందే. అయితే తీరా అవి నరేంద్ర మోడీ ప్రభుత్వం నోట్ల రద్దు చేసిన తర్వాత సాధించిన ఫలితాలు ఏమిటన్నది ఇంతవరకు సామాన్యుడి అంతుపట్టని విషయంగా పరిణమించింది. అసలు నోట్ల రద్దు కారణంగా మోడీ అందిస్తున్న, మోడీ సాధించిన సత్ఫలితాలు ఏమిటన్నది ప్రతి సామాన్యుడిని తొలిచి వేస్తున్న ప్రశ్న. ప్రధాని మోడి మొదట్లో తాను 50 రోజుల్లో సత్ఫలితాలు ఏమిటో చెప్పడానికి గడువు 55 రోజులు చాలు అన్నాడు. నోట్లు రద్దు చేసి ఇప్పటికి దాదాపు 78 రోజులైనా కనీసం ఆ నోట్ల రద్దు ద్వారా సమాన్యుడి జీవితాలను వెలిగించే ఏ ఒక్క ధరను కూడా కేంద్రప్రభుత్వం అదుపు చేయలేకపోవడం ఎంతైనా శోచనీయం. ఈ సందర్భంగా గణతంత్ర దినాన్ని పురస్కరించుకొని అయినా కనీసం నోట్ల రద్దు ద్వారా సామాన్యుడి ఒనగూరే ప్రయోజనాలేంటో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
భారత దేశంలో ప్రతి వ్యక్తినీ, ప్రతి సామాన్యుడికి భారంగా మారిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి నిత్యావసర వస్తువులపై ఇంతవరకు ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వం ద్వంద్వ వైఖరికి నిదర్శనంగా ప్రజలు భావిస్తున్నారు. నిజంగా కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు అంశాన్ని సత్ఫలితాల దిశగా అమలు చేస్తే నిత్యావసర వస్తువులన్నీ ఇప్పటికే అదుపు అయ్యి ఉండేవని, ప్రభుత్వం తీసుకున్న హడావుడి నిర్ణయాలు, ప్రణాళిక లేమి, ఆచరణాత్మకంగా లేకపోవడం కారణంగానే మంచి ఫలితాలు ఆశించిన స్థాయిలో ప్రజలకు అందడం లేదని ప్రజలు భావిస్తున్నారు. నోట్ల రద్దు ఆ తర్వాత జరిగిన పరిణామాలు వీటన్నింటిని బట్టి చూస్తే సమాన్యుడికే తీవ్రమైన భారం పడింది తప్ప దీని ద్వారా ప్రభుత్వం సాధిస్తుంది, సాధించింది ఏం లేదని కూడా ప్రజలు భావిస్తున్నారు.
కాగా నోట్ల రద్దు అంశంపై అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. అదేంటంటే.. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు, ప్రజల కరెన్సీ కష్టాలు తీర్చేందుకు ఐదుగురు ముఖ్యమంత్రులతో ఓ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. దానికి మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని అధ్యక్షునిగా కూడా నియమించింది కేంద్రం. ఈ మధ్యనే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి ఆ నివేదికను ప్రధానికి సమర్పించారు. కమిటీ రూపొందించిన కొన్ని సిఫారులను చంద్రబాబు నాయుడు ప్రధానికి అందించారు. అందులో రూ.50 వేలు మించిన విత్ డ్రాలపై పన్నులు వేయాలని చంద్రబాబు కమిటీ ప్రధానంగా ఆ నివేదికలో సూచించింది. నగదు రహితాన్ని ప్రోత్సహించడం కోసం డిజిటల్ లావాదేవీలపై ట్యాక్సులు లేకుండా చేయాలని కూడా చంద్రబాబు కోరారు. డిస్కౌంట్లూ, ఆఫర్లూ ప్రకటిస్తూ ఆదాయపన్ను పరిధిలో రానివారికి స్మార్ట్‌ఫోన్లు, బయోమెట్రిక్ మెషీన్ల కొనుగోళ్లపై రూ. 1000 తగ్గింపు ఇవ్వాలని అన్నారు. అన్ని లావాదేవీలూ ఆధార్ ఆధారంగానే జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆ నివేదికలో సూచించడం జరిగింది.
కాగా పెద్దనోట్ల రద్దు కారణంగా కేంద్రప్రభుత్వం ఏం సాధించిందన్నది ఇంతవరకు కేంద్ర ప్రభుత్వానికి కూడా అర్థం కావడం లేదు. అన్ని రంగాలను కోలుకోలేని దెబ్బ తీసిన ఈ నిర్ణయం ద్వారా ప్రధాని ఏం సాధించాడన్నది ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న. ఎంత నల్లధనం బయటకి వచ్చిందో తెలీదుగానీ… కష్టార్జితాన్ని వాడుకోవడంపై ఇంకా కొత్తకొత్త ఆంక్షలు విధిస్తే సామాన్యుడి అసహనాన్ని మరింత పెంచినట్టే అవుతుంది. ఇంకా చెప్పాలంటే.. ఈ నివేదికలో నోట్ల రద్దు కారణంగా ఒక్కసారిగా కుదేలై తీవ్రంగా దెబ్బపడ్డ ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టే సూచనలుగానీ, దెబ్బతిన్న పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసే సలహాలు వంటివి గానీ ఇందులో సూచించక పోవడం ఎంతైనా శోచనీయం. పరిశీలించి చూస్తే... నగదు రహితం వంటి వాటి వరకే ఈ కమిటీ పరిమితం అయినట్లు తెలుస్తుంది. దీంతో నోట్ల రద్దు కారణంగా కేంద్ర ప్రభుత్వం సాధించిన సత్ఫలితాలను ఆచరణాత్మకంగా చూపాల్సిన అవసరం కేంద్రానికి ఎంతైనా ఉంది.