క్రియేటివ్ జీనియస్, హిట్టు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా తన ప్రతి చిత్రాన్ని ఓ కళాఖండంగా తీర్చిదిద్దే దర్శకరత్నం మణిరత్నం. ఎంతో కాలంగా సరైన హిట్ లేక బాధపడుతున్న ఆయనకు ఆమధ్య తీసిన 'ఓకే కన్మణి' మంచి హిట్‌నిచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగులో 'ఓకే బంగారం' పేరుతో దిల్‌రాజు విడుదల చేయగా, ఇక్కడ కూడా మంచి విజయం సాధించి, మణికి పూర్వవైభవాన్ని అందించింది. నేటితరం యువత టేస్ట్‌కు అనుగుణంగా ఇందులో ప్రేమ, సహజీవనం వంటి విషయాలను మణి తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు. కాగా ప్రస్తుతం ఆయన తమిళ, తెలుగు బాషల్లో మంచి గుర్తింపు ఉన్న కార్తీ హీరోగా ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి మణికి కార్తి దర్శకత్వ శాఖలో శిష్యుడు. ఈ తాజా చిత్రానికి తెలుగులో 'డ్యూయెట్' అనే పేరు పెట్టి, ఫస్ట్‌పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి కూడా తెలుగుబాధ్యతలను మణి, దిల్‌రాజుకే అప్పగించిన విషయం తెలిసిందే. కానీ ఈ 'డ్యూయెట్' చిత్రం టైటిల్ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అందులోనే గతంలో ఈ పేరుతో ఏ భాషల్లోనూ ఓ చిత్రం రూపొందినా, అవి విజయం సాధించలేదు. దీంతో సెంటిమెంట్‌గా భావించారో, లేక ప్రేక్షకుల్లోకి టైటిల్ సరిగా బాగా వెళ్లి,
ఆకర్షించలేకపోయిందని భావించారో గానీ ఈ చిత్రం టైటిల్‌ను తెలుగులో 'చెలియా'గా మార్చాడు. ఈ విషయంలో దిల్‌రాజు నిర్ణయాన్ని మణి కూడా ఓకే చేశాడట. ఈ చిత్రం కొత్త టైటిల్ 'చెలియా'తో త్వరలో కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ చిత్రంలో కార్తి ఓ పైలైట్ పాత్రను పోషిస్తున్నాడు. 'రోజా, బొంబాయి' తరహాలోనే ఈ చిత్రం కూడా కాశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోంది. కానీ కాశ్మీర్‌లో పరిస్థితులు బాగా లేకపోవడంతో చెన్నైలోనే కాశ్మీర్‌ను తలదన్నేలా ఓ సెట్‌నువేసి అక్కడ పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మరోపక్క ఈ చిత్రం విదేశాల్లో కూడా చిత్రీకరణ జరుపుకుంటోంది. హైదరాబాదీ అయిన ఆదితారావు హైదరీ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె హైదరాబాదీ అయినప్పటికీ ఇప్పటివరకు తెలుగులో ఆమె ఒక్క చిత్రంలో కూదా నటించలేదు. ఈ చిత్రం తెలుగు అనువాదం ద్వారా ఆమె టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మార్చిలో విడుదల చేయాలని భావిస్తున్నారు. త్వరలో రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించనున్నారు.