గత కొంత కాలంగా జనసేన పార్టీ అధినేత, సినిమా హీరో అయిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఏపీ ప్రభుత్వానికి మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్నాడు. ఏపీలో ఉన్న ప్రతి ఒక్క సమస్యపై పోరాడుతూ ఏపీ ప్రభుత్వానికి, మంత్రులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పవన్ తాజాగా ఏపీ ప్రత్యేక హోదా పై మళ్ళీ నిప్పులు చెరుగుతున్నాడు. మోడీని, చంద్రబాబుని ఏకకాలంలో కడిగి పారేస్తూ సినిమాల్లో హీరోయిజాన్ని నిజ జీవితంలో కూడా చూపిస్తున్నాడు పవన్. ప్రత్యేక హోదా మౌన పోరాటానికి పవన్ ఏపీ యువతను చైతన్యం చెయ్యడానికి గత వారం రోజులుగా ట్వీట్స్ చేస్తూ ఉత్సాహ పరుస్తున్నాడు.
వైజాగ్ లో జరుగతున్న శాంతియుత పోరాటాన్ని పోలీసులు అణిచివేయడాన్ని తప్పుబడుతూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్న పవన్ ఏపీ.. ఎంపీలు సుజనా చౌదరి, రాయపాటిలను పదునైన మాటలతో చీల్చి చెండాడుతున్నాడు. అయితే పవన్ ఇదంతా హైదరాబాద్ నుండే నడిపిస్తున్నాడు. తాను 'కాటమరాయుడు' షూటింగ్ లో పాల్గొంటూనే ఎప్పటికప్పుడు వైజాగ్ లోని పరిస్థితిని సమీక్షిస్తున్న పవన్ మాత్రం మౌన పోరాటానికి ప్రత్యక్షంగా హాజరవలేదు. అయితే పవన్ ముందుండి ఈ శాంతియుత పోరాటాన్ని నడిపిస్తాడని చాలామంది ఆశపడ్డారు. ఇంకా మిగతా సినీ తారలు కూడా ప్రత్యేక హోదాకి ట్విట్టర్ వేదికగా మద్దతు పలుకుతున్నారు. కానీ సంపూర్ణేష్ మినహా ఎవరు ప్రత్యేక హోదాలో ప్రత్యక్షంగా పాల్గొనలేదు.
ఇక ప్రతి ఒక్క నిమిషానికి ఒక ట్వీట్ చేస్తూ పవన్ మాత్రం టిడిపి నాయకుల్లో, పోలీసుల్లో వణుకు పుట్టిస్తున్నాడు. మరి పవన్ ట్వీట్స్ తో ఏపీ నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు కానీ... ఒకవేళ నిజంగా పవన్ ప్రత్యక్షంగా గనక ఈ మౌన పోరాటంలో పాల్గొంటే గనక అక్కడ పరిస్థితి మరోలా ఉండేదని చాలామంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.