బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను కృష్ణ జింకల వేట కేసు ఇంకా పీడిస్తూనే ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కోర్టుకు హాజరైన సల్మాన్ కు రాజస్థాన్ లోని జోద్ పూర్ కోర్టు నుండి పలు రకాల వింత ప్రశ్నలు ఎదురయ్యాయి. సహజంగా కోర్టులో ఏ కేసునైనా విచారించే ముందు, ఆ కేసుకు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కోర్టు కోరిన కొన్ని ప్రశ్నలకు సల్మాన్ స్పందిస్తూ...ముఖ్యంగా తాను హిందువునని, అందులోనూ ముస్లింనని, అంతకంటే ముందు ఓ భారతీయుడినని చెప్పాడు. కోర్టు అడిగిన ప్రశ్నలకు మొదట హిందీలో సమాధానం చెప్పిన సల్మాన్ తర్వాత ఇంగ్లీషులో కూడా సమాధానం చెప్పాడు. అంతేకాకుండా సల్మాన్ ఇంకా మాట్లాడుతూ ఈ విషయంలో తనపై చాలా తప్పుడు అభియోగాలు మోపారని కూడా కోర్టుకు వెల్లడించాడు. ఇంతటితో ఆగకుండా ఇది తప్పుడు కేసు అని కూడా ఆరోపణలు చేశాడు. సల్మాన్ ఖాన్ ను జోద్ పూర్ కోర్టు మొత్తం 65 ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయగా అన్నింటికీ సమాధానాలు చెప్పాడు. అయితే సల్మాన్ ఖాన్ సహనటుల ఆధ్వర్యంలోనే ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది. కాగా ఓ సినిమాకు సంబంధించిన షూటింగ్ సందర్భంగా సల్మాన్ ఖాన్ రెండు జింకలను చంపాడనే ఆరోపణల మూలంగా 1998లో సల్మాన్ ఖాన్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే.