తాజాగా పవన్... వెంకయ్యనాయుడు విమర్శలకు ధీటుగా స్పందించాడు. ఈ విషయంలో సినీజోష్ వేసిన ప్రశ్నలనే ఆయన సంధించడం విశేషం. దేశాన్ని ఉత్తరాది, దక్షిణాదిగా విడగొడుతున్నావన్న వెంకయ్యను ఆయన మీరు మతాలతో విడగొట్టవచ్చా? అని ప్రశ్నించాడు. వాస్తవానికి పవన్ మతాలకు, కులాలకు అతీతంగా స్పందించాడు. ఈ విషయాన్ని మేథావులు హర్షిస్తున్నారు. కానీ కుల, మత రాజకీయాలు ఎక్కువగా ప్రభావం చూపే ప్రజలు మన దేశంలో ఉన్నారు. వారిలో హిందువులది మెజార్టీ వర్గం. వారి అండదండలు బిజెపికి బాగా కలిసొచ్చాయి. కానీ ప్రస్తుతం పవన్ చేసిన వ్యాఖ్యల వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిని, పవన్ ముస్లింలను బుబ్జగించాడనే విమర్శ, వ్యతిరేకత రావడం సహజమే.
దాంతో ఆయన మెజార్టీ ఓట్లను, అండను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఇక పవన్ కులంకు వ్యతిరేకం. దాంతో ఆయన కాపు రిజర్వేషన్లపై స్పందించకపోవడం వల్ల ఆయన వర్గాన్ని కూడా దూరం చేసుకునే అవకాశాలే ఉన్నాయి. చిరు, దాసరి, ముద్రగడ వంటి వారు కాపులలో హీరోలుగా చెలామణి అయి పవన్‌కు వ్యతిరేకంగా మాట్లాడినా ఆశ్చర్యం లేదు. ఇక ఇప్పటికే పవన్ ప్రత్యేక హోదా విషయంలో ఉద్యమానికి ముందుకు వస్తే ఆయనతో చేతులు కలపడానికి కాంగ్రెస్, వామపక్షాలతో పాటు పలు ప్రజా సంఘాలు, యువత, మేథావులు సిద్దంగా ఉన్నారు. తాజాగా పవన్ చిత్తశుద్దితో ఉద్యమాలు చేస్తే, తాను వైసీపీకి కూడా మద్దతు ఇస్తానని తెలపడం కూడా చర్చనీయాంశం అయింది.
జగన్ ప్రతి విషయాన్ని రాజకీయం చేయడంలో, అందరి మద్య చిచ్చులు పెట్టే విషయంలో ముందుంటాడనే విమర్శ ఉంది. ఇక ప్రత్యేక హోదా ఉద్యమంలో రోజాతో పాటు పలువురు వైసీపీ నేతలు పవన్‌పై దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. నేటి రాజకీయ పార్టీలన్నీ కూడా కులం, మతం ప్రాతిపదికనే నడుస్తుండటంతో వారు పవన్‌ను పావుగా వాడుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని జగన్ హైజాక్ చేసి లబ్దిపొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవంక పవన్ కేంద్రాన్ని ఉద్దేశించి, తెలివితేటలు కేవలం నార్త్ బ్లాక్‌కే పరిమితం కాదన్నాడు. తాను లెఫ్ట్, రైట్, ఇలా ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదని స్పష్టం చేయడంతో పవన్ భవిష్యత్తులో అలా ఓపెన్‌గా మాట్లాడితే, కుల, ప్రాంత, మతాల అంశాలను విపక్షాలకు అస్త్రంగా అందించిన వాడవుతాడేమోనని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.