కొన్ని చిత్రాల షూటింగ్‌లను నిశ్శబ్దంగా, టైటిల్‌ను నిర్ణయించినప్పటికీ ప్రకటించకుండా, తాము ఏ చిత్రం చేస్తున్నాం.. దాని నేపధ్యం ఏమిటి? అనేవి బయటపెట్టకుండా చూసుకుంటూ జాగ్రత్తలు వహిస్తుంటారు. ప్రస్తుతం 'పద్మావతి' అనే రాణి జీవితాన్ని దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టైటిల్‌తో పాటు, ఈ చిత్ర నేపధ్యాన్ని కూడా ఆయన ముందే రివీల్ చేశాడు. కేవలం పబ్లిసిటీ యావ, సినిమాపై ప్రారంభం నుండే క్రేజ్ రావాలనే తాపత్రయం, ప్రీరిలీజ్ బిజినెస్, వార్తల్లో నిలవడం కోసమే ఆయన ఆ పని చేసినట్లు అర్ధమవుతోంది. దీంతో రాజస్ధాన్‌లోని రాజ్‌పుత్‌లకు చెందిన రాజ్‌కర్ణి సేన ఆ చిత్రం షూటింగ్ సమయంలో దాడి చేసిన సంగతి తెలిసిందే. భన్సాలీ తొందరపడకుండా సైలెంట్‌గా చిత్రం తీసుంటే అసలు ఈ సమస్యే వచ్చేది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో టాలీవుడ్ దర్శకనిర్మాతలు, హీరోల సీక్రెసీని అందరూ పాటించాలనే వాదన వినిపిస్తోంది. గతంలో బాలీవుడ్‌లో కూడా మీరానాయర్ తెరకెక్కించిన వివాదాస్పద చిత్రం 'కామసూత్ర'ను ఆమె ఎంతో తెలివిగా, ఈ చిత్రం విషయం బయటకు తెలిస్తే ఇబ్బందులు, సమస్యలు వస్తాయని తెలిసే, ఎలాంటి హడావుడి లేకుండా చిత్రం పూర్తి చేసిన విషయాన్ని వారు ఉదహరిస్తున్నారు. ఇక ఈ దాడిపై భన్సాలీ ఆవేదన వ్యక్తం చేశాడు. అల్లరిమూకలు తుపాకులతో వచ్చి, కాల్పులు కూడా జరిపాయని, కానీ యూనిట్‌లోని అందరం ప్రమాదం నుంచి తప్పించుకున్నామన్నాడు. మరోపక్క ఈ చిత్రంలో రాణి పద్మావతిని కించపరిచే దృశ్యాలే లేవని యూనిట్ అంటోంది. దీంతో ఈ దాడి చేసిన రాజ్‌కర్ణి సేన సభ్యులు మాట్లాడుతూ, ఇందులో పద్మావతిని చెడుగా చూపించడం లేదనే విషయాన్ని భన్సాలీ ముందుగా మాకు తెలిపి ఉంటే బాగుండేదంటున్నారు. ఇక ఈ దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సమాచార, ప్రసారశాఖా మంత్రి వెంకయ్యనాయుడు రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజేకు వ్యక్తిగతంగా ఫోన్ చేసినా కూడా ఆమె ఓటు బ్యాంకు కోసం, ఎవరో బాధపడతారని భావించి, దాడి చేసిన వారిపై కనీసం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు కూడా స్వీకరించనివ్వలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.