ప్రజలల్లో సెలబ్రిటీలుగా ఉండే వారిపై మీడియాలో గాసిప్స్ వస్తూనే ఉంటాయి. కాగా గతంలో స్వీటీ అనుష్కపై కూడా ఎన్నో వార్తలు షికార్ చేశాయి. ఆమె ఓ బిజినెస్‌మేన్‌ను పెళ్లాడబోతోందని, వారి ఎంగేజ్మెంట్ కూడా జరిగిందని పుకార్లు వచ్చాయి. ఇక నాగ్‌తోపాటు నాగ్ తనయుడు నాగచైతన్యలతో కూడా ఆమెను కలపి ఎన్నో వార్తలు వచ్చి పుకార్లుగా నిలిచాయి. మరోపక్క టాలీవుడ్ హీరోలైన ప్రభాస్, గోపీచంద్‌లతో పాటు తమిళ హీరో ఆర్యతో కూడా ఆమెకు ప్రేమాయణం అంటగట్టారు. తాజాగా ఇలాంటి వార్తలపై అనుష్క మీడియాపై సెటైర్లు వేసింది. సినీతారలు, రాజకీయనాయకులు, క్రికెటర్లు వంటి వారిపై ఇలాంటి వార్తలు రావడం సహజమేనని, ముఖ్యంగా తమలాంటి వారిపై అలాంటి వార్తలు వస్తే చదివే వారికి, చూసే వారికి మంచి కిక్ రావడమే దీనికి కారణంగా చెప్పుకొచ్చింది. ఇటీవల మీడియా వారు ఇలాంటి పుకార్ల విషయంలో తనను క్షమించి వదిలేశారని, ప్రస్తుతం తనపై అలాంటి వార్తలు పెద్దగా రావడం లేదని తెలిపింది. తన మనస్తత్వాన్ని మీడియా వారు గమనించే తనపై అలాంటి పుకార్లను రాయడం మానేశారేమో.. అంటూ సెటైర్ విసిరింది.
పనిలో పనిగా తనతోటి నటీనటులకు ఓ సలహా కూడా ఇచ్చింది. ఎవ్వరి విమర్శలు పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలని, మీ కుటుంబ సభ్యులకు తప్ప వేరెవ్వరికీ భయపడాల్సిన పనిలేదని ధైర్యం చెప్పింది. ఇక త్వరలోనే ఆమె నటించిన 'ఎస్3, ఓం నమో వేంకటేశాయ'చిత్రాలు పక్కపక్కరోజునే విడుదలకు సిద్దమవుతున్నాయి. ఏప్రిల్28న ఆమె నటిస్తున్న 'బాహుబలి-2' విడుదల కానుంది.మెగాస్టార్ చిరుతో ఆయన 150వ చిత్రం 'ఖైదీ'లో పలు సమస్యల వల్ల నటించలేకపోయిన స్వీటీ ఆయన 151వ చిత్రంలో నటించనుందనే వార్తలు వస్తున్నాయి. ఇక అనుష్క మీడియాలో తనపై ఇప్పుడు గాసిప్‌లు రావడం లేదని తెలిపింది. కానీ తాజాగా ఆమెపై ఓ పుకారు షికార్ చేస్తోంది. 'సైజ్‌జీరో' కోసం బాగా లావెక్కిన స్వీటీ అ తర్వాత 'బాహుబలి2', 'ఎస్3'చిత్రాలకు తగ్గట్లు తిరిగి సన్నబడలేకపోయింది.
దీంతో ఆమె ఇప్పటికీ బొద్దుగానే ఉంది. 'బాహుబలి-2'కి సంబంధించి ముంబైలో జరిగిన ప్రీలుక్ రిలీజ్ ఫంక్షన్‌తో పాటు షూటింగ్లలో కూడా ఆమె ఇంకా బొద్దుగానే ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో దర్శకుడు రాజమౌళి ఆమెను మందలించినట్లు కూడా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ చిత్రం పోస్టర్లో ప్రభాస్‌తో పాటు విల్లును చేతబట్టిన ఆమె చాలా నాజూకుగా, సరైన కొలతలతో కనిపిస్తోంది. దీంతో మీడియో ఆమె లావు తగ్గలేకపోవడంతో రాజమౌళి గత్యంతరం లేక ఆమెతో షూటింగ్ చేశాడని, ప్రస్తుతం స్క్రీన్‌పై బొద్దుగా కనిపించే ఆమెను సన్నగా, నాజూగ్గా చూపించే బాధ్యతలను విదేశీ గ్రాఫిక్ డిజైనర్లకు అప్పగించాడనే వార్తలు వస్తున్నాయి. మరి మీడియాపై వేసిన సెటైర్లలో ఈ అంశం లేకపోవడం చూసిన వారు అవి ఆమె చెవులకు చేరలేదా? లేక ఆమె ఆ విషయంలో మాత్రం మౌనం వహించిందా? అనే సెటైర్లు వినిపిస్తున్నాయి.