బాలయ్య తిసుకునే నిర్ణయాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఆయన ఎప్పుడు ఎవరిని నెత్తి మీద పెట్టుకుంటాడో? ఎవరిని పక్కకు తోసేశాడో ఎవరికీ అర్ధం కాదు. దాసరికి 'పరమవీరచక్ర' చిత్రం చేశాడు. తనకు వరుస హిట్లను అందించి ఆయనకు ఘనవిజయాలు అందించి, ఆయన పెద్దస్టార్‌గా మారడానికి దోహదపడిన బార్గవ్ ఆర్ట్స్ అధినేత గోపాల్‌రెడ్డిని, దర్శకుడు కోడిరామకృష్ణను అర్థాంతరంగా దూరం పెట్టాడు. ఇక వివాదాస్పద నిర్మాతగా, పలు చీటింగ్ ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్న బెల్లంకొండకు స్నేహం హస్తం అందించాడు. కాని 'లక్ష్మీనరసింహ' చిత్రం రిలీజ్ తర్వాత ఆయనకు బెల్లంకొండతో తీవ్ర విబేధాలు వచ్చాయి.
దాంతో బెల్లంకొండ తీరుపై అభిమానులు బాలయ్యకు స్వయంగా ఫిర్యాదు చేశారు. దానికి బాలయ్య ఆనాడు స్పందిస్తూ.. మాట తప్పి మిమ్మల్ని, నన్ను బాధపెట్టిన ఆ లం....' అంటూ బెల్లంకొండను అభిమానుల ముందే తిట్టి, మీరు వాడిని ఏమైనా చేయండి... నేను అడ్డుపడను.. అని చెప్పిన మాట వాస్తవం. దాంతో బాలయ్య అభిమానులు కొందరు బెల్లకొండపై దాడి చేశారు. చివరకు ఈ వివాదం కాల్పుల వరకు వెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తర్వాత బెల్లంకొండతో, బాలయ్యతో మాట్లాడి కొందరు ఈ వ్యవహారం ముదరకుండా పరిష్కరించి, రాజీ చేశారు. అందులోని కండిషన్ ప్రకారం బాలయ్య, బెల్లం కొండకు ఓ చిత్రం పరిహారంగా చేస్తానని హామీ ఇచ్చాడు. కానీ బాలయ్య అభిమానుల నుండి మాత్రం బెల్లంకొండపై తీవ్ర వ్యతిరేకత రావడంతో బాలయ్య వెనకడుగు వేశాడు. ఆ తర్వాత బాలయ్యకు చెక్ పెట్టేందుకు జూనియర్ ఎన్టీఆర్‌ను బెల్లంకొండ దగ్గరకు తీశాడు.
ఇది కూడా ఎందరికో మింగుడుపడని అంశం. ఆ తర్వాత బి.గోపాల్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా 'హర హర మహాదేవ' చిత్రం చేస్తున్నానని చెప్పి పోస్టర్లు, బేనర్లు కూడా కట్టి బెల్లంకొండ ఆ చిత్రం ఆగిపోవడంతో వెకిలిగా మిగిలిపోయాడు. ఆ తర్వాత కూడా ఆయన తన ప్రయత్నాలు ఆపలేదు. 'వీడు తేడా' ఫేమ్ చిన్నికృష్ణ దర్శకత్వంలో బాలయ్యను ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా చూపిస్తూ, ఓ చిత్రం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత పూరీ-బాలయ్యల కాంబోలో ఓ చిత్రం చేస్తానని అనౌన్స్ చేశాడు. కానీ ఇవేమీ పట్టాలెక్కలేదు. ప్రస్తుతం మరలా సీనియర్ స్టార్స్ హవా నడుస్తోంది. బాలయ్య 100వ చిత్రం 'గౌతమీపుత్ర' మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. దీంతో బెల్లంకొండ బాలయ్యతో మరలా చర్చలు జరిపి, తనకు ఓ చిత్రం చేయమని అడిగి, బాలయ్యను ఒప్పించాడట.
బాలయ్య కూడా కొన్ని కండీషన్స్ మీద ఈ చిత్రం చేయడానికి అంగీకరించాడని సమాచారం. దీంతో ఆఘమేఘాల మీద ఓ స్టార్ రైటర్‌ను పిలిపించి బాలయ్య కోసం ఓ స్టోరీ రెడీ చేయిస్తున్నాడు. ఈ స్టోరీ బాలయ్యకు నచ్చితే ఆయన ఎవరిని దర్శకుడిగా సూచిస్తే వారిని పెట్టుకోవాలని, లేనిపక్షంంలో బాలయ్య మెచ్చిన దర్శకుడు, ప్రస్తుతం తన కొడుకు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ను డైరెక్ట్ చేస్తున్న బోయపాటి శ్రీనుతో ఆచిత్రం చేయాలని భావిస్తున్నాడు. మరోపక్క బెల్లంకొండ తన కొడుకును కూడా భారీ మాస్‌హీరోను చేయాలనే కలతో కోట్లు ఖర్చుపెట్టుడున్నాడు. తద్వారా తన సొంత ఇంట్లోనే ఓ మాస్ హీరో ఉంటే ఇక తాను ఎవ్వరినీ బతిమిలాడాల్సిన అవసరం ఉండదని ట్రై చేస్తున్నాడు.
ఇందులో భాగంగా తనకు పరిచయమున్న స్టార్స్‌తో తన కొడుకుకు భారీ ప్రమోషన్ ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. బాలయ్య అభిమానులు మరలా తమ హీరో బెల్లంకొండతో సినిమా చేస్తే ఒప్పుకుంటారా? చిరు, అశ్వనీదత్‌ని ప్రోత్సహించినట్లు, బాలయ్య కూడా బెల్లంకొండను చేరదీసి తప్పుచేస్తున్నాడా? అనే టాక్ వినిపిస్తోంది. ఇక తాజాగా తనకు 'గౌతమీపుత్ర...' వంటి మెమరబుల్ హిట్‌ను అందించిన మృదుస్వభావి, దర్శకనిర్మాత క్రిష్‌పై కూడా బాలయ్య తీవ్రంగా మండిపడ్డాడని, ఈ చిత్రం కలెక్షన్స్‌ను ఐటీకి భయపడి అనౌన్స్ చేయని క్రిష్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా వాస్తవమే అంటున్నారు. మరి బాలయ్య ఎవరిని ఎప్పుడు అనుగ్రహిస్తాడో.. ఎవరిని ఎందుకు ఆగ్రహిస్తాడో ఎవ్వరికీ అర్ధంకాకుండా ఉంది.