సినిమా వారి లీలలు చిత్రాతిచిత్రం, వారిని కొన్ని మీడియాలు బాగా భజన చేస్తూ మోస్తూ ఉంటాయి. వారికి చిత్ర విచిత్రమైన బిరుదులిచ్చేస్తూ, భజన చేయడం మా బాధ్యత అన్నట్లుగా ప్రోత్సహిస్తుంటాయి. వీరి వెనుక ఆయా హీరోల ప్రోత్సాహం, మీడియా యాజమాన్యం తీసుకునే నిర్ణయాల వల్ల కొందరు జర్నలిస్ట్‌లు విధిలేని పరిస్థితుల్లో ఆలా భజన చేయాల్సివస్తోందనేది వాస్తవం. కాగా కొందరు కొన్ని చిత్రాలను మల్టీస్టారర్లుగా పేర్కొంటూ ఉంటారు. తాజాగా అడవిశేషు, వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్‌ల చిత్రాన్ని మలీస్టారర్ అన్నారు. ఇక సునీల్, నాగచైతన్యలు కలిసి నటించిన 'తడాఖా', మంచు విష్ణు, రాజ్‌తరుణ్‌లు కలిసి నటించిన 'ఆడో రకం.. ఈడో రకం' వంటి చిత్రాలను కూడా మల్టీస్టారర్స్‌గా పిలిచారు. 'మనం' వంటి క్లాసికల్ హిట్ చిత్రంలో నటించిన స్వర్గీయ ఏయన్నార్, నాగార్జులు నిజమైన స్టార్లు. కానీ కొందరు మాత్రం అందులో నాగచైతన్య, అఖిల్ వంటి స్టార్లు కూడా నటిస్తున్నారని వెల్లడించారు. మంచు మోహన్‌బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్, వరుణ్‌సందేష్ వంటి వారు నటించిన 'పాండవులు పాండవులు తుమ్మెద'ని కూడా మల్టీస్టారర్ మూవీ అన్నారు. దానిని మంచు ఫ్యామిలీ చిత్రం అనడం సమంజసమే గానీ మల్టీస్టారర్ అనడం తప్పు. ఒకప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్-ఏయన్నార్ కలిసి నటించిన చిత్రాలు, ఎన్టీఆర్-కృష్ణలు, ఏయన్నార్-కృష్ణలు, కృష్ణ-శోభన్‌బాబు, కృష్ణ- కృష్ణంరాజు వంటి వారు నటించినవే మల్టీస్టారర్ చిత్రాలు. అంతేగానీ అల్లుశిరీష్, వరుణ్‌తేజ్, సాయిధరమ్‌తేజ్, మంచువిష్ణు, మంచుమనోజ్, నాగచైతన్య, సునీల్, కళ్యాణ్‌రామ్, తారకరత్న, సుమన్, భానుచందర్, వినోద్‌కుమార్, రాజశేఖర్, అర్జున్,జె.డి.చక్రవర్తి, నాగబాబు, శ్రీకాంత్, వేణు,నవదీప్, సందీప్‌కిషన్, ఆర్య,రానా, వరుణ్‌సందేష్, తనీష్.... వంటి వారు నటించే చిత్రాలను మల్టీహీరోలు నటించే చిత్రాలని గానీ, లేక మంచి స్టార్‌క్యాస్టింగ్ ఉన్న మూవీస్‌గా గానీ పిలవాల్సి వుంది. అంతేగానీ, ఎవరు కలిసి నటించినా వాటిని మల్టీస్టారర్లుగా పోల్చడాన్ని అందరూ మానాలి.