నేటితరం యంగ్‌హీరోలలో నానిది ప్రత్యేకశైలి. చిరు, రవితేజల తర్వాత ఎవ్వరి అండదండలు లేకుండానే పైకెదుతున్న నాని ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నాడు. కాగా మీడియాతో పాటు నాని కూడా డబుల్ హ్యాట్రిక్‌కు చేరువలో ఉన్నానని , 'నేను లోకల్' విడుదల సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆయన నటించిన 'ఎవడే సుబ్రహ్మణ్యం, భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాధ, జెంటిల్‌మేన్, మజ్ను' చిత్రాలు హిట్టయ్యాయని, ఇక ఆయన తాజాగా నటించిన 'నేను లోకల్' కూడా విజయం సాధిస్తే ఆయన గత ఎన్నో దశాబ్దాలుగా మూలనపడి ఉన్న డబుల్‌హ్యాట్రిక్‌ను సాధించిన ఘనత ఆయనకే దక్కుతుందని మీడియాలో ప్రచారం బాగా జరిగింది.
అయితే 'ఎవడే సుబ్రహ్మణ్యం, మజ్ను' చిత్రాలను కూడా హిట్ లిస్ట్‌లో చేర్చడంపై భిన్నవాదనలు వినిపించాయి. కానీ అవి సేఫ్ ప్రాజెక్ట్‌లని, ఎవ్వరికీ నష్టాలు తేలేదని, కొన్ని కొన్ని ప్రకృతిపరమైన కారణాల వల్ల ఆయా చిత్రాలు భారీగా లాభాలు సాధించలేకపోయాయని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇక అదే కరెక్ట్ అనుకుంటే తాజాగా దిల్‌రాజు నిర్మాతగా ఆయన నటించిన 'నేను లోకల్' పరిస్థితి ఏమిటి? అనే దానిపై కూడా అందరిలో ఆసక్తి పెరుగుతోంది. ఇక ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే డివైట్‌టాక్ వచ్చింది. డైలాగ్స్ తప్ప సినిమాలో పసలేదని కొందరు వాదిస్తున్నారు. అయినా కూడా ఈ చిత్రానికి మంచి కలెక్షన్లు వస్తున్నట్లు సమాచారం. ట్రేడ్‌వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం తొలి మూడురోజుల్లోనే 14కోట్ల వరకు సాధించిందని, తొలిరోజే 6కోట్లను వసూలు చేసిందని, విదేశాలలో కూడా ఇప్పటికే ఈ చిత్రం 5కోట్ల మార్క్‌ను దాటిందని అంటున్నారు. ఇదే నిజమైతే మాత్రం గ్రేటే.
ఎందుకంటే ఒకప్పుడు లాంగ్‌రన్‌లో నాని చిత్రాలకు 15 నుంచి 20కోట్ల వరకు వచ్చేది. కానీ 'నేను లోకల్' చిత్రం మొదటి వారంలోనే అంతటి కలెక్షన్లను సాధించిదంటే చాలా గొప్పే. ఇక ఈ చిత్రానికి ప్రీరిలీజ్ బిజినెస్ 19కోట్ల వరకు జరిగిందంటున్నారు. ఆ లెక్కన చూస్తే నాని 'నేను లోకల్' చిత్రం లాంగ్‌రన్‌లో బయ్యర్లకు, నిర్మాతకు లాభాల పంట పడించినట్లే అవుతుంది. దీంతో నాని 'నేను లోకల్'తో డబుల్‌హ్యాట్రిక్ కొట్టినట్లేనని ప్రచారం మొదలైంది. ఇక ఈ చిత్రం విషయానికి వస్తే కథలో దమ్ములేకపోయినా కేవలం నాని ఈ చిత్రాన్ని ఒంటి చేత్తో నడిపించాడనేది వాస్తవం. ప్రస్తుతం నాని శివశంకర్ అనే నూతన దర్శకుని చిత్రంలో నటిస్తూ, షూటింగ్ నిమిత్తం అమెరికాలో ఉన్నాడట. అక్కడ 'నేను..లోకల్' సక్సెన్‌ను ఎంజాయ్ చేస్తున్నాడని అంటున్నారు.