తెలుగులో రీతూ వర్మ చిన్న చితక సినిమాల్లో నటిస్తూ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. అయితే గత ఏడాది వచ్చిన 'పెళ్లి చూపులు' చిత్రంతో ఆమె పేరు టాలీవుడ్ లో మార్మోగిపోయింది. 'పెళ్లి చూపులు' చిత్రం విడుదలై ప్రభంజనం సృష్టించింది. ఇక ఈ చిత్రంలో నటించిన నటీనటులు ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. అయితే 'పెళ్ళి చూపులు'లో హీరోగా చేసిన విజయ్ దేవరకొండకి మంచి అవకాశాలే తలుపుతట్టాయి. ఇక హీరోయిన్ గా మంచి పేరు కొట్టేసిన రీతూ వర్మకి పేరైతే వచ్చిందికాని అనుకున్నంత అవకాశాలు రాలేదు. అయితే ఇప్పుడు రీతూ వర్మకి ఒక బంపర్ ఆఫర్ తగిలింది అంటున్నారు. అది అలాంటి ఇలాంటి ఆఫర్ కాదట.
ఏకంగా తమిళ హీరో విక్రమ్ పక్కన ‘ధృవ నట్చత్తిరమ్’ లో హీరోయిన్ గా ఆఫర్ వచ్చిందని అంటున్నారు. గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో విక్రమ్ హీరోగా ‘ధృవ నట్చత్తిరమ్’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో ముందుగా అను ఇమ్మాన్యువల్ ని హీరోయిన్ గా ఎంపిక చేసి ఫోటో షూట్ కూడా చేశారట. కానీ అను కి తెలుగులో చేతినిండా సినిమాలు ఉండడంతో డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేక విక్రమ్ మూవీ నుండి తప్పుకుంది. ఇంకేముంది ఆ ఛాన్స్ మన రీతూ వర్మని తగులుకుంది. ఇక రీతూ వర్మ ఇప్పటికే ‘ధృవ నట్చత్తిరమ్’ సెట్స్ లో జాయిన్ అయినట్లు వార్తలొస్తున్నాయి. మరి ఒక్క చిన్న సినిమా హిట్ తో ఒక మాదిరి హీరోతో జోడి కట్టకుండా ఏకంగా విక్రమ్ లాంటి పెద్ద హీరో పక్కన ఛాన్స్ కొట్టేసి అబ్బో అనిపించింది రీతూ.